- లగచర్ల ఘటనలో కేటీఆర్ తప్పు బయటపడింది
- మూసీ ప్రాజెక్ట్ ఆపేందుకుకలిసి కుట్రలు
- బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతేకిషన్ రెడ్డి బయటికొస్తరు
- ఫొటో షూట్ కోసమే మూసీ నిద్ర
- ఒక్క రోజు నిద్రతోఒరిగిందేమీ లేదు
- మూడు నెలలు ఉండేందుకు సిద్ధమా? అని సవాల్
హైదరాబాద్, వెలుగు: లగచర్ల ఘటనలో కేటీఆర్ తప్పు బయటపడిందని, ఆయన్ను కాపాడేందుకే మూసీ నిద్ర పేరుతో బీజేపీ డ్రామాలాడుతున్నదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ గ్రాఫ్ పడిన ప్రతిసారీ కిషన్ రెడ్డి బయటికి వస్తారని విమర్శించారు. ఆ పార్టీని ప్రొటెక్ట్ చేయడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారని ఎద్దేవా చేశారు. ‘‘బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒకటే. ఎవరికి ఆపదొచ్చినా.. ఒకరికొకరు ఆదుకుంటరు. మూసీ పునరుజ్జీవంపై సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తం. అంతేగానీ.. దీన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే సహించం’’అని మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు.
గాంధీభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టామని అన్నారు. సీఎం నిర్ణయాన్ని అందరూ సమర్థించాలని కోరారు. ‘‘మూసీ ప్రాజెక్ట్ ఆపేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై కుట్ర చేస్తున్నాయి. ఎవరు అడ్డుపడినా.. మూసీ పునరుజ్జీవం ఆగదు’’అని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.
సాక్సులు వేసుకుని నిద్రపోతరా?
ఫొటో షూట్ కోసమే కిషన్ రెడ్డి మూసీ నిద్ర చేశారని మహేశ్ గౌడ్ విమర్శించారు. ‘‘బస చేసే ముందు ఆ ఏరియాలో దోమల, ఈగల మందు కొట్టారు. కాళ్లకు సాక్సులు వేసుకుని నిద్రపోయారు. దీన్ని బట్టే అక్కడ దోమలు ఉన్నాయని అర్థమవుతున్నది. మేము అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తే నువ్వు అక్కడ ప్లాట్ కొనుక్కుంటావా? ఒక్క రోజు నిద్రతో ఒరిగేదేమీ లేదు. ఒక్క రోజు నిద్ర చేసి ఏం తెలుసుకున్నారో బీజేపీ నేతలు చెప్పాలి. మూసీ పక్కన మూడు నెలలు ఉంటే ప్రజల అవస్థలు తెలుస్తయ్. ఇద్దరం కలిసి మూడు నెలలు అక్కడే బస చేద్దాం’’అని కిషన్ రెడ్డికి మహేశ్ గౌడ్ సవాల్ విసిరారు.
సర్వేపై సందేహాలుంటే సంప్రదించండి
‘ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే’కు సంబంధించి కార్యకర్తలు, లీడర్లకు ఎలాంటి సందేహాలు ఉన్నా.. 72890 87272 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. గాంధీ భవన్ లో ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే మిస్డ్ కాల్ నంబర్ పోస్టర్ ని ఆయన ఆవిష్కరించారు.
నేడు సంగారెడ్డికి మహేశ్ గౌడ్
సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో సోమవారం ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు మీటింగ్ ప్రారంభకానున్నది. డీసీసీ అధ్యక్షురాలు, ఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్‌కు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర తదితరులు హాజరుకానున్నారు.
ఎవరికీ అన్యాయం జరగనివ్వం
డీపీఆర్ వచ్చాక ఎక్కడ రిటర్నింగ్ వాల్ కట్టాలో తెలుస్తదని మహేశ్ గౌడ్ తెలిపారు. ‘‘ఎవరికీ అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిది. సబర్మతిపై లేని అభ్యంతరం.. మూసీపై ఎందుకు? మార్పు కోసం ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ మార్పు చూపించబోతున్నం. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఆదుకుంటాం. వారి పిల్లలకు విద్యా అవకాశాలు కల్పిస్తున్నం.
మాది బుల్డోజర్ ప్రభుత్వం కాదు. ఆ తరహా ప్రభుత్వం యూపీలో ఉన్నది. గుజరాత్ గులాం లా ఎందుకు వ్యవహరిస్తున్నరు? ప్రపంచంతో తెలంగాణ పోటీ పడుతున్నదని వీళ్లకు భయం పట్టుకున్నది. ఎక్కడ గుజరాత్‌ను తెలంగాణ వెనక్కి నెట్టేస్తదేమో అనే భయం బీజేపీ లీడర్లను వెంటాడుతున్నది’’అని మహేశ్ గౌడ్ అన్నారు.