బండి సంజయ్​ క్షమాపణ చెప్పాలి: పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​

బండి సంజయ్​ క్షమాపణ చెప్పాలి: పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​
  • పేదల ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడ్తే ఆయనకు బాధేంది?
  • బీఆర్ఎస్ ఇక ఉండదు.. నాలుగు ముక్కలవుతది: పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​

హైదరాబాద్, వెలుగు: ఉక్కు మహిళగా పేరొందిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. 

‘‘ఇందిరమ్మ పేరు ఉంటే పేదలకు ఇండ్లు ఇవ్వబోమని బండి సంజయ్ ఎలా అంటారు? ఇలా మాట్లాడటం ఆమెను అవమానించడమే. కేంద్ర మంత్రి స్థాయిలో ఉంటూ సంజయ్.. ఒక మాజీ ప్రధాని విషయంలో అలా మాట్లాడడం సరైంది కాదు. 

పేదల ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడితే సంజయ్​కు ఎందుకంత బాధ?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో మహేశ్​గౌడ్​ మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోటా అంటూ పేదలకు అన్యాయం చేశారని, ఇప్పుడు మాత్రం అర్హులైన వారికే ఇండ్లు ఇస్తామని స్పష్టం చేశారు. 

‘‘తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఇక బీఆర్ఎస్ ఉండదు. ఆ పార్టీ నాలుగు ముక్కలు అవుతుంది. తండ్రీకొడుకులు తప్ప బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరు” అని పేర్కొన్నారు. నాలుగు కొత్త స్కీంలను ఆదివారం ప్రారంభిస్తున్నామని చెప్పారు.

షాద్ నగర్ లో జరగనున్న స్కీంల ప్రారంభోత్సవ  కార్యక్రమంలో తాను పాల్గొంటానని   మహేశ్ గౌడ్ చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ప్రారంభిస్తున్నామని.. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సంబురాలు జరుపుకోవాలని కాంగ్రెస్  కేడర్​కు ఆయన సూచించారు. 

  •  కేంద్ర మంత్రా?  గుండానా?: జగ్గారెడ్డి

బీజేపీ నేత బండి సంజయ్ కేంద్ర మంత్రా? గుండానా? అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. శనివారం సాయంత్రం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. పేదలకు ఇచ్చే ఇండ్లకు ఇందిరమ్మ పేరు పెడితే నిధులు ఇవ్వబోమని తెలంగాణ ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

రాజకీయ అనుభవం తక్కువగా ఉన్న సంజయ్ మీడియాలో బ్రేకింగ్ లు రావాలని ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రం నిధులు బీజేపీ నేతల సొంత నిధులు కావని, ప్రజలు కట్టిన పన్నులేనని గుర్తు చేశారు. 

రేవంత్ పాలన చూసి బీఆర్ఎస్ నేతలైన కేటీఆర్, హరీశ రావులకు బుర్రలు పనిచేయడం లేదని ఫైర్ అయ్యారు. కొత్త రేషన్ కార్డులను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.