కేంద్రం నిధులిచ్చేదాకా పోరాడుతాం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కేంద్రం నిధులిచ్చేదాకా పోరాడుతాం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • రాజకీయాలు పక్కనపెట్టి అందరూ కలిసి రావాలి
  • కేంద్ర మంత్రులకు రాష్ట్రాభివృద్ధి పట్టదా?
  • తెలంగాణపై ప్రేమ ఉంటే పదవులకు రాజీనామా చేయాలి
  • కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రంపై వివక్ష సహించేది లేదు
  • రాష్ట్రానికి కేంద్రం అన్యాయం: మంత్రి సీతక్క 

హైదరాబాద్, వెలుగు: బడ్జెట్​లో రాష్ట్రానికి కేంద్రం తీవ్ర అన్యాయం చేసిందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణపై బీజేపీకి అసలు ప్రేమే లేదన్నారు. కొన్ని రాష్ట్రాలకే ఫండ్స్ కేటాయిస్తే.. వికసిత్ భారత్ లక్ష్యం ఎలా నెరవేరుతుందని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు సంజయ్, కిషన్ రెడ్డికి రాష్ట్రాభివృద్ధి పట్టదా? అని నిలదీశారు. తెలంగాణపై ప్రేమ ఉంటే ఇద్దరూ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం అన్ని పార్టీల నేతలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్​లో తెలంగాణపై వివక్షకు నిరసనగా ఆదివారం ట్యాంక్​బండ్​పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పీసీసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మాట్లాడారు. ‘‘తెలంగాణ ప్రజలు బీజేపీని ఎప్పటికీ క్షమించరు. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. కేంద్రం నిధులిచ్చే దాకా శాంతియుతంగా పోరాటం చేస్తాం. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్.. దేశ సమగ్ర అభివృద్ధికి కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలకే కేటాయించినట్టు ఉన్నది.

 రాష్ట్రం నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉంటే తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చింది. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్.. అన్న కవిత వినిపించి.. తెలుగువారి ఆకాంక్షలను దెబ్బతీసిన్రు. బడ్జెట్ కేటాయింపులు ఢిల్లీ, బిహార్ ఎన్నిక‌‌‌‌ల కోస‌‌‌‌మే అన్నట్లు ఉంది. జీఎస్టీ, పన్నుల రూపంలో తెలంగాణ నుంచి కేంద్రం సుమారు రూ.1లక్ష కోట్లు వసూలు చేస్తున్నది. కనీసం రూ.40వేల కోట్లు తిరిగి ఇవ్వకపోవడం బాధాకరం’’అని ఆయన మండిపడ్డారు. సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

ఇద్దరు కేంద్ర మంత్రులుండి లాభం లేదు: సీతక్క

బడ్జెట్ లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని మంత్రి సీతక్క మండిపడ్డారు. కేటాయింపుల విషయమై మంత్రులు, ఎంపీలు ప్రధానికి ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ.. చివరికి మొండి చేయి చూపించారని అన్నారు. ‘‘రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నులను దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించాలి. కేంద్ర బడ్జెట్.. బిహార్ ఎన్నికల బడ్జెట్ మాదిరి ఉన్నది. దేశ బడ్జెట్​లా లేదు. తెలంగాణ అంటే బీజేపీకి విద్వేషం. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి కూడా రాష్ట్రానికి నిధులు తీసుకురాలేదు’’అని సీతక్క పేర్కొన్నారు. 

తెలంగాణ అంటేనే బీజేపీకి వివక్ష: మంత్రి పొన్నం

తెలంగాణ అంటేనే బీజేపీకి వివక్ష అని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీజేపీ ఎంపీల్లో తెలంగాణ డీఎన్​ఏ ఉంటే ఇప్పటికైనా బడ్జెట్​లో జరిగిన అన్యాయం గొంతు ఎత్తాలన్నారు. ‘‘బీఆర్ఎస్ నేతలు పదేండ్లుగా కేంద్రానికి నిధులు అడగలేదని సంజయ్, కిషన్ రెడ్డి అన్నరు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఎన్నో సార్లు నిధుల కోసం కేంద్రాన్ని విన్నవించినా చివరికి రూపాయి కూడా కేటాయించలేదు. బిహార్, ఢిల్లీ, ఏపీలు మాత్రమే దేశంలో లేవన్న విషయం కేంద్రం గుర్తు పెట్టుకోవాలి. 

అన్ని రాష్ట్రాలు కలిస్తేనే దేశం అవుతది’’అని పొన్నం అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణకు అన్యాయం జరుగుతూనే ఉన్నదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, నాగరాజు, శ్రీగణేష్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.