పదేండ్లలో ఇచ్చిన ఉద్యోగాలెన్ని: పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​గౌడ్​

పదేండ్లలో ఇచ్చిన ఉద్యోగాలెన్ని: పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​గౌడ్​
  • తొమ్మిది నెలల్లోనే  50 వేల ఉద్యోగాలు నింపినం
  • సామాజిక న్యాయం గురించి బీఆర్​ఎస్సా మాట్లాడేది?
  • సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు ఎందుకు బయటపెట్టలేదని నిలదీత
  • గ్రూప్​ 1 అభ్యర్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న పీసీసీ చీఫ్

హైదరాబాద్, వెలుగు: పదేండ్లు బీఆర్​ఎస్​ అధికారంలో ఉండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో ఒక్కసారి కేటీఆర్​ గుర్తుచేసుకోవాలని పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​గౌడ్​ అన్నారు. తమ ప్రభుత్వానికి నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధి ఉంది కాబట్టే.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నదని తెలిపారు. ‘‘అధికారంలోకి వచ్చిన కేవలం 9 నెలల్లోనే దాదాపు 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 

ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత కష్టమైనా.. ప్రతి హామీని నెరవేరుస్తాం. పదేండ్లు అధికారంలో ఉండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కేటీఆర్​ గుర్తుచేసుకొని మాట్లాడితే మంచిది” అని ఆయన అన్నారు. గురువారం గాంధీ భవన్ లో గ్రూప్ 1 అభ్యర్థులతో మహేశ్​గౌడ్​ భేటీ అయ్యారు. వారి సమస్యలను, డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. ‘‘మీకు న్యాయం జరగాలంటే ఏ రకంగా చేయాలో అది ప్రభుత్వం చేసి చూపిస్తుంది. పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు.. అయితే ఆ వెసులుబాటు కల్పించే అవకాశం ప్రభుత్వానికి ఉందా..లేదా..అనేది తెలుసుకుంటా” అని గ్రూప్​ 1 అభ్యర్థులతో ఆయన అన్నారు.  

సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టు ఎందుకు బయటపెట్టలే?

బీఆర్​ఎస్​ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసి, ఆ రిపోర్ట్​ను ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదని కేటీఆర్​ను మహేశ్​గౌడ్​ నిలదీశారు. సామాజిక వర్గాల న్యాయం గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు ఎక్కడిదని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అన్నివర్గాలకు న్యాయం చేస్తూ ప్రజాపాలనను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని ఆయన తెలిపారు. కాగా, అంతకు ముందు గ్రూప్ 1 అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని గాంధీభవన్ వద్దకు  రాగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 

అయితే.. వారి డిమాండ్లను తెలుసుకొనేందుకు వారితో తాము చర్చలు జరుపుతామని, వారిని వదిలివేయాలని పీసీసీ చీఫ్ మహేశ్  గౌడ్ పోలీసులకు సూచించారు. దీంతో పోలీసులు గ్రూప్ 1 అభ్యర్థులను గాంధీ భవన్ లోకి అనుమతించారు. పరిమిత సంఖ్యలో అభ్యర్థులను గాంధీ భవన్ లోకి అనుమతించడంతో వారితో మహేశ్​గౌడ్​ చర్చలు జరిపి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.