ప్రజలను తిప్పలు పెట్టారు.. కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్​ కేసు కరెక్టు : మహేశ్​కుమార్

ప్రజలను తిప్పలు పెట్టారు.. కేటీఆర్ పై  ఫార్ములా ఈ రేస్​ కేసు కరెక్టు : మహేశ్​కుమార్

హైదరాబాద్​సిటీ, వెలుగు: మాజీ మంత్రి కేటీఆర్​పై పెట్టింది అక్రమ కేసు కాదని, కరెక్టు  కేసే అని పీసీసీ చీఫ్ ​మహేశ్​ కుమార్  గౌడ్​ అన్నారు. ఫార్ములా ఈ– కార్ రేసు మీద అన్ని ఆధారాలతోనే కేసు నమోదు చేశారన్నారు. శుక్రవారం శాసన మండలి మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. కేసు విషయంలో గవర్నర్  అనుమతి ఇచ్చిన తర్వాతే ముందుకు పోతున్నామన్నారు.

కార్​ రేస్​లో హెచ్ఎండీఏ భాగస్వామ్యం లేకపోయినా విదేశీ సంస్థలకు రూ.55 కోట్ల నిధులు ఇచ్చారని, దీంతోపాటు మూడేండ్ల పాటు రేసింగ్  జరిగేలా రూ.600 కోట్ల  ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. ఫార్ములా ఈ– రేస్ తో హైదరాబాద్ ప్రతిష్ట పెరగలేదని, ప్రజలను ఇబ్బంది పెట్టి ట్రాఫిక్  జామ్​ చేసి రేసింగ్  నిర్వహించారని మండిపడ్డారు. ఈ– రేసింగ్  కేసుపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

తప్పు చేయకపోతే భయమెందుకు?: జీవన్ రెడ్డి

‘‘ఫార్ములా కార్  రేసుపై కేసు పెట్టనంత వరకు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న కేటీఆర్.. ఇప్పుడు చర్చపెట్టాలనడం విడ్డూరంగా ఉంది” అని కాంగ్రెస్​ సభ్యుడు టి.జీవన్​రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియా పాయింట్​లో ఆయన మాట్లాడారు. ఏ తప్పు చేయకపోతే కేటీఆర్​కు భయమెందుకని ఆయన ప్రశ్నించారు. తప్పు చేసిన వారికి శిక్షతప్పదని హెచ్చరించారు.