
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భారత్ సమ్మిట్తో రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ప్రపంచ నలుమూలల నుంచి 100 దేశాలకు పైగా 450 మంది ప్రతినిధులు పాల్గొని చారిత్రాత్మకమైన భారత్ సమ్మిట్‌ను విజయవంతం చేశారు. పలు అంశాలపై మేధావులు లోతైన చర్చలు జరిపి ప్రజాపక్షాన పోరాడాల్సిన ఆవశ్యకతను ఈ సమావేశంలో గుర్తించారు. 1955లో జరిగిన బాండుంగ్ చారిత్రాత్మక సమావేశాల 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ‘డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్’ థీమ్తో హైదరాబాద్లో భారత్ సమ్మిట్ సమావేశాలు నిర్వహించడమైంది.
దేశ తొలి ప్రధాని నెహ్రూ ప్రవేశపెట్టిన అలీన విధానంతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన కాంగ్రెస్ అదే వారసత్వాన్ని అందిపుచ్చుకొని, పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఆయన మార్గదర్శకంలో ఈ సమావేశాలను దిగ్విజయంగా నిర్వహించింది. ప్రపంచంలోని బలహీనవర్గాలను ఆదుకోవాలనే ప్రధాన లక్ష్యంగా ఏప్రిల్ 25, 26 రెండు రోజుల సమావేశంలో 44 అంశాల ఎజెండాను ఏకగ్రీవంగా ఆమోదించారు.
పలు దేశాలకు చెందిన 50మందికి పైగా మంత్రులు, 50మందికి పైగా సెనేటర్లు, ఎంపీలు, సుమారు 100 మంది సెక్టోరల్ నిపుణులు పాల్గొని సామాజిక సేవ, ఆర్థిక న్యాయం, అంతర్జాతీయ సహకారాలపై చర్చించారు. రెండు రోజులు జరిగిన ఈ సమావేశాల్లో విదేశీ ప్రతినిధులతో పాటు రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర సీనియర్ నేతలు భాగస్వాములయ్యారు. వారివారి అభిప్రాయాలను, విలువైన సలహాలు, సూచనలు అందించారు. మొదటిరోజు... లింగ న్యాయం, భవిష్యత్‌లో స్త్రీవాదంపై, వాస్తవం, ఊహాత్మకం అంశాలు, యువతరం, రేపటి రాజకీయాలపై, నూతన బహుపాక్షికత అంశాలపై చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా చట్టసభల్లో మహిళలకు రాజకీయ అవకాశాల కోసం చేపట్టాల్సిన సంస్కరణలపై వక్తలు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.
మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న రంగాల్లో అవినీతి తక్కువ ఉండడమే కాకుండా..విద్య, వైద్యం, సంక్షేమాలకు పెద్దపీట వేస్తున్న వాస్తవాలను నొక్కిచెప్పారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ మహిళల సాధికారత కోసం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకం, ఇందిరా మహిళాశక్తి పథకం వంటి పథకాలకు విదేశీ ప్రతినిధుల నుంచి అభినందనలు వెలువడ్డాయి. మహిళా శక్తి బజార్‌ను వారు సందర్శించి, దీనిపై ఆసక్తి కనబర్చారు.
డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం
వాస్తవికతకు ఊహాత్మకతకు మధ్య సంఘర్షణపై చర్చిస్తూ డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టిస్తున్న విధానాలను, అంతిమంగా బడుగులకు ఎదురవుతున్న అన్యాయాలను పలు ఉదాహరణలతో మేధావులు ఉటంకించారు. సోషల్ మీడియా, ఏఐతో ప్రచారమవుతున్న అవాస్తవాలతో సమాజానికి జరుగుతున్న నష్టాలపై చర్చించారు.
వీటి కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై విలువైన సూచనలొచ్చాయి. యువత రాజకీయాలకు దూరంగా ఉంటే సమాజానికి నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు యువత ముందుకు రావాలని ఈ సందర్భంగా ప్రతినిధులు పిలుపునిచ్చారు.
రాజకీయాల్లోకి యువత రావాలన్న రాహుల్యువ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ యువతరానికి ఇస్తున్న ప్రాధాన్యం ఈ చర్చల్లో ప్రతినిధులందరినీ ఆకర్షించింది. తెలంగాణలో కూడా యువత రాజకీయాల వైపు మళ్లేలా కాంగ్రెస్ పార్టీ వారికి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్న తీరును విదేశీ ప్రతినిధులు అభినందించారు. ‘బహుళ ధ్రువ ప్రపంచంలో శాంతి-న్యాయం’ అంశంపై జరిగిన చర్చలో శాంతి కోసం ఐక్యరాజ్యసమితి సరైన చర్యలు తీసుకోలేకపోతోందనే అభిప్రాయం వచ్చింది.
ప్రపంచ శాంతి, న్యాయం కోసం అన్ని దేశాలు రాజకీయాలకు అతీతంగా చేయిచేయి కలపాలని ప్రతినిధులు పేర్కొన్నారు. వాతావరణ మార్పుపై పోరాడేందుకు అభివృద్ధి చెందిన దేశాలు సాయం చేయాలని కోరారు. ‘ఓవర్ కమింగ్ పోలరైజేషన్ విత్ ప్లూరలిజం, డైవర్సిటీ అండ్ రెస్పెక్ట్’ అంశంపై ప్రతినిధులు మాట్లాడుతూ వివక్ష లేని సమాజం కోసం బలమైన ప్రజాస్వామ్య విధానాల ఆవశ్యకతను గుర్తించారు.
భిన్నత్వంలో ఏకత్వం కోసం కాంగ్రెస్ కృషి
బహుళత్వం, భిన్నత్వమున్న భారతదేశంలో ఏకత్వం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషి ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. ‘ఎకనామిక్ జస్టిస్ ఇన్ అన్సర్టెయిన్ టైమ్స్’ అనే అంశంపై చర్చిస్తూ ఆర్థిక అసమానతలపై ఆందోళన వెలిబుచ్చారు. ప్రస్తుతం తలసరి ఆదాయం లెక్కించే విధానం వాస్తవికతకు దూరంగా ఉంటోందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని ముగ్గురు సంపన్నులు 120 మిలియన్ల జనాభా కలిగిన మూడు దేశాల జీడీపీకి సమానమైన సంపద కలిగి ఉండడం దురదృష్టకరమన్నారు. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు ఇలానే పెరుగుతూపోతే సమాజంలో అశాంతికి దారి తీస్తుందని చర్చల్లో ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
రాహుల్ పాదయాత్రపై ప్రతినిధుల ఆసక్తి
రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నిర్వహించిన పాదయాత్రపై ఆయన అనుభవాలను వినడానికి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు ఆసక్తి కనబర్చారు. జాతిపిత మహాత్మా గాంధీ అహింసా మార్గాన్ని అనుసరిస్తూ ప్రజల వద్దకు వెళ్లడమే సరైన మార్గమనే తలంపుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్టు రాహుల్ గాంధీ తెలిపారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లకుపైగా నిర్వహించిన పాదయాత్రలో కొత్త కొత్త అనుభవాలు ఎదురయ్యాయని, ప్రజలు చెబుతున్న కష్టాలను విని చలించిపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్న ప్రతిపక్షాలను తొక్కేస్తూ విద్వేష రాజకీయాలను ప్రభుత్వాలు అవలంబించినా ప్రేమతోనే ఎదుర్కొంటామంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులందరిలో స్ఫూర్తి నింపింది.
ప్రపంచానికి రోల్ మోడల్గా తెలంగాణ
రాష్ట్రంలో ఉన్న మానవ వనరులు, అందుబాటులో ఉన్న విద్యుత్, భూములు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సబ్సిడీలు, ముడిసరుకు, ఆయా రంగాలకు పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ సర్కార్ ఈ సమావేశాలను వినియోగించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఫ్యూచర్ సిటీ విదేశీ ప్రతినిధులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వంపై విదేశీ ప్రతినిధులు ఆసక్తి చూపించారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం అమలు తీరును విదేశీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
భారత్ సమ్మిట్ కార్యక్రమం ప్రారంభానికి రెండు రోజుల ముందు కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులు మృతి చెందడం ప్రతినిధులందరినీ కలచివేసింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలను, వర్గాలను ఎండగట్టాలని భారత్ సమ్మిట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన రాష్ట్రంలో సామాజిక న్యాయం, పేదల, మహిళల, రైతుల, యువత అభివృద్ధి కోసం చేపట్టిన పలు కార్యక్రమాలు ప్రపంచానికి రోల్ మోడల్గా ఉన్నాయని వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం.
ఆకర్షించిన తెలంగాణ రైజింగ్
భారత్ సమ్మిట్ కార్యక్రమానికి అన్నీ తానై ముందుండి నడిపించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ ప్రసంగం ప్రతినిధులందరినీ ఆకర్షించింది. తెలంగాణ రాష్ట్రంలో 15 నెలల పాలనలోనే విప్లవాత్మకంగా చేపట్టిన పలు కార్యక్రమాలపై ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు.
సబ్బండ వర్గాలు కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్లలో వారి ఆశలు నెరవేరకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే పలు మహిళా సంక్షేమ పథకాలను అమలు చేయడం, రైతు సంక్షేమ పథకాలు, 60 వేలకుపైగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం, కులగణనను విజయవంతంగా పూర్తి చేయడం, బడుగు బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం వంటి అంశాలపై సీఎం రేవంత్ తెలియజేసిన విషయాలు తమ దేశాలకు కూడా ఆదర్శంగా ఉన్నాయని పలు దేశ, విదేశీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
విజయవంతంగా నిర్వహించిన భారత్ సమ్మిట్ సమావేశాల్లో వచ్చిన విలువైన సూచనలు, సలహాలను తెలంగాణ అభివృద్ధికి ఉపయోగించుకొని 2050 వరకు రాబోయే పాతికేళ్ల ప్రణాళికలను రూపొందించుకునే సదవకాశం రాష్ట్రానికి దక్కింది.
బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు