
- అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకే బీజేపీతో దోస్తీ: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: బీజేపీకి కేటీఆర్కట్టుబానిసలా పనిచేస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ ఆరోపించారు. దొంగల ముఠాలా రాష్ట్రాన్ని పదేండ్ల పాటు దోచుకున్న కల్వకుంట్ల కుటుంబం.. అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీతో దోస్తీ చేస్తోందని ఫైర్ అయ్యారు. శనివారం కేటీఆర్ చేసిన విమర్శలపై మహేశ్ గౌడ్ ఒక ప్రకటనలో స్పందించారు. ‘‘హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు సరిపడా సభ్యుల సంఖ్యా బలం లేకపోయినా.. బీఆర్ఎస్ అండ చూసుకొని బరిలో నిలిచింది నిజం కాదా? ఇప్పుడు బీజేపీని గెలిపించేందుకు కేటీఆర్ తాపత్రయపడుతున్నది నిజం కాదా? మీ సోదరి కవితను లిక్కర్ స్కాం నుంచి కాపాడడానికి బీజేపీకి ఊడిగం చేసింది వాస్తవం కాదా? పదేండ్లపాటు రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పాలించిన మీరు.. మీ అక్రమాలపై కేంద్రం చర్యలు తీసుకోకుండా ప్రధాని మోదీకి దాసోహమయ్యారా? లేదా?’’ అని కేటీఆర్ ను మహేశ్‌గౌడ్ నిలదీశారు.
మీ బలహీనతలను ఆసరాగా తీసుకున్న మోదీ.. రాష్ట్రానికి న్యాయంగా, హక్కు కొద్ది రావాల్సిన వాటాలను, నిధులను ఇవ్వకుండా అన్యాయం చేసినా ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ నోరు మెదపలేదని ఆరోపించారు. సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేసిన బీఆర్ఎస్ పాలకులు.. కేంద్రాన్ని నిలదీయకపోవడంతో పదేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైందని ధ్వజమెత్తారు. పదేండ్ల పాటు కేంద్రం ఏ బిల్లు ప్రవేశపెట్టినా గుడ్డిగా మద్దతు ఇచ్చిన మీరు.. ఇప్పుడు కాంగ్రెస్ ను ప్రశ్నించడం ఏమిటని ఫైర్ అయ్యారు.
బీజేపీపై ఉన్న ప్రేమతోనే బీఆర్ఎస్ హెచ్‌సీయూపై తప్పుడు ప్రచారం చేసిందని విమర్శించారు. కేవలం 15 నెలల స్వల్ప కాలంలోనే రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చామని, మహిళా, రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని, ఎస్సీ వర్గీకరణ, పేదలకు సన్నబియ్యం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే.. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అదే పనిగా రాష్ట్రాన్ని బద్నాం చేస్తూ, తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ పై మహేశ్‌గౌడ్ మండిపడ్డారు.