
- ఆ భూములను మై హోంకు కట్టబెట్టేందుకే రెండు పార్టీల ఆందోళనలు: పీసీసీ చీఫ్
- 2014లోనే 50 ఎకరాలు మైహోమ్స్‌కు బీఆర్ఎస్ఇచ్చింది
- అప్పుడు దెబ్బతినని పర్యావరణం ఇప్పుడెలా దెబ్బతింటుందో చెప్పాలి
- కావాలనే కిషన్ రెడ్డి, కేటీఆర్.. విద్యార్థులను రెచ్చగొడుతున్నరని ఫైర్
హైదరాబాద్, వెలుగు: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ దోస్తానా బయటపడిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. ఆ 400 ఎకరాలను మైం హోం రామేశ్వరరావుకు కట్టబెట్టాలనే కిషన్ రెడ్డి, కేటీఆర్ కలిసి విద్యార్థులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ.. సెంట్రల్ యూనివర్సిటీకి 2,500 ఎకరాల భూములను కేటాయించారని గుర్తుచేశారు. ఆ తర్వాత హెచ్‌సీయూ తన అవసరాల కోసం కంచ గచ్చిబౌలిలోని 534.28 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి, బదులుగా గోపన్‌పల్లిలో నుంచి 397.16 ఎకరాలు తీసుకుందన్నారు.
అలా సర్కారుకు వచ్చిన భూముల్లో 400 ఎకరాలను 20 ఏండ్ల క్రితం చంద్రబాబు సర్కారు ఐఎంజీ భారత సంస్థకు కేటాయించగా.. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఈ కేటాయింపును రద్దు చేసిందన్నారు. అప్పటి నుంచి ఈ వివాదం కోర్టులో నడుస్తోందని మహేశ్కుమార్గౌడ్వివరించారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ బినామీగా ఉన్న రామేశ్వరరావు ఈ భూములపై కన్నేశాడని.. కోర్టు వివాదంలో ఉన్న సర్వే నంబర్ 25 లోని భూములను ఆక్రమించి ‘మై హోం విహంగ’ నిర్మించారని చెప్పారు. ఇందుకోసం కేటీఆర్ 100 ఫీట్ల రోడ్డు కూడా వేయించారని గుర్తుచేశారు.
అప్పుడు పర్యావరణం గుర్తుకు రాలేదా?
మై హోం రామేశ్వరరావు ఆకాశహార్మ్యాలు నిర్మిస్తుంటే.. ఆనాడు కేటీఆర్, కిషన్ రెడ్డికి హెచ్‌సీయూ భూములు, పర్యావరణం గుర్తుకు రాలేదా? అని మహేశ్‌గౌడ్ ప్రశ్నించారు. అప్పుడు దెబ్బతినని పర్యావరణం ఇప్పుడు ఎలా దెబ్బతింటుందో స్పష్టం చేయాలన్నారు. సుప్రీంకోర్టు ఈ భూములు ప్రభుత్వానివే అని తీర్పు ఇచ్చినా.. బీఆర్ఎస్, బీజేపీ రెండు నాలుకల ధోరణిని ప్రదర్శిస్తున్నాయని ధ్వజమెత్తారు. పర్యావరణం పట్ల నిజమైన ప్రేమ ఉంటే కేటీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ మై హోం విహంగ నుంచే ఆందోళనలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఇప్పుడు కూడా 400 ఎకరాలను ఏదోవిధంగా మైం హోం రామేశ్వరరావుకు దక్కేలా చూడాలనే తాపత్రయంతోనే బీఆర్ఎస్-, బీజేపీ ఆందోళనలు చేస్తున్నాయని విమర్శించారు. 2004 నుంచి ఇప్పటి వరకు జరిగిన వ్యవహారా లను తేదీలు, మెమోలు, ఉత్తర్వులతో సహా ప్రభుత్వం, టీజీఐసీసీ, ప్రజల ముందు ఉన్నాయన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టి తెరవెనుక కుట్రలు చేస్తున్న ఈ ‘అంబికా బ్రదర్స్’ ఉద్దేశాలు బహిర్గతమైనట్టు తెలిపారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అమలు చేస్తున్న 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూ ల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో మహాధర్నాకు వెళ్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటిం చారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తమ నిబద్ధతను కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.