లగచర్ల దాడిలో మొదటి ముద్దాయి కేటీఆరే : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

  • చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • ప్రభుత్వ కార్యక్రమాలు అడ్డుకోవడమే ఎజెండాగా బీఆర్ఎస్ కుట్ర
  • భూములు లేనోళ్లు, రైతులు కానోళ్లు దాడి చేయడం ఏమిటి?
  • వచ్చే నెల 2 లేదా 3న హైదరాబాద్​లో భారీ సభ

హైదరాబాద్, వెలుగు: లగచర్ల దాడిలో మొదటి ముద్దాయి కేటీఆరేనని పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. చేసిన తప్పుకు కేటీఆర్ శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నెహ్రూ జయంతి సందర్భంగా గురువారం గాంధీ భవన్​లో ఆయన చిత్ర పటానికి డిప్యూటీ సీఎం భట్టి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీతో కలిసి పీసీసీ చీఫ్ పూలమాల వేసి నివాళులర్పించారు.

తర్వాత మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. అధికారం పోయిందనే అక్కసు కేటీఆర్​లో అణువణువునా కనిపిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడమే ఎజెండాగా బీఆర్ఎస్ కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణను బీఆర్ఎస్ అడ్డుకుంటుందన్నారు. ఈ దాడిని ప్రోత్సహించేలా కేటీఆర్ ఫోన్ కాల్ సంభాషణలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారని అన్నారు. కేటీఆర్ నుంచి ఫోన్ కాల్ వెళ్లగానే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తన కార్యకర్తలతో కలిసి కలెక్టర్ పై దాడి చేయించారని ఆరోపించారు. ముందస్తు కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందన్నారు.

పక్కా ప్లాన్​తో బీఆర్ఎస్ దాడి

రైతులు కానివాళ్లు, అక్కడ భూములు లేని వాళ్లు దాడి చేయాల్సిన అవసరం ఏముందని మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. కలెక్టర్ తో పాటు అధికారులపై దాడి చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. అధికారులపై దాడులు చేయడం ఏమిటని బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా బీఆర్ఎస్ భారీ కుట్రలు చేస్తుందని, పక్కా ప్లాన్ తోనే ఈ దాడి జరిగిందన్నారు. అభివృద్ధి కోసం తాము తపన పడుతుంటే, బీఆర్ఎస్ నేతలు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

రాజకీయాల కోసం చిల్లర వేషాలు వేయడం ఏమిటని దుయ్యబట్టారు. ఈ దాడి ఘటనలో ఎవరు ఉన్నా వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫార్ములా ఈ-–రేస్ లో డబ్బులు చేతులు మారాయని, ప్రభుత్వ సొమ్మును కేటీఆర్ తన వారికి కట్టబెట్టారని మహేశ్ గౌడ్​అన్నారు. ప్రభుత్వ సొమ్మును కాజేసినా చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ఎవరి డబ్బులని ఇష్టారాజ్యంగా వాడుతారని ఫైర్ అయ్యారు.

సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని వివరిస్తం

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా వచ్చే నెల 2 లేదా 3న కాంగ్రెస్​తరఫున హైదరాబాద్ లో భారీ సభను నిర్వహిస్తామని మహేశ్ గౌడ్ తెలిపారు. ఈ సభలో ఏడాది కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను జనాలకు వివరిస్తామన్నారు. ఈ నెల 16 నుంచి ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు. కరీంనగర్ జిల్లాతో తన పర్యటనను ప్రారంభిస్తానని పేర్కొన్నారు. జిల్లాల్లో పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడం, రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ విజయానికి క్యాడర్ ను సమాయత్తం చేయడం కోసం తన టూర్ కొనసాగుతుందన్నారు.