హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గత పదేండ్లలో బీఆర్‌ఎస్ చేయని సంక్షేమం, అభివృద్ధి 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. బీఆర్ఎస్ విధ్వంస పాలన నుంచి పునరుద్ధరణ వైపు తెలంగాణ పయనిస్తోందన్నారు.
సోమవారం శాసన మండలి మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న, దండె విఠల్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ తల్లిని ఇప్పటివరకు అధికారికంగా గుర్తించలేదు. కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోపే సెక్రటేరియెట్‌లో విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయం. చట్టం తెచ్చి అధికారికంగా ఇదే విగ్రహం ఉండేలా చూడాలని సీఎం రేవంత్‌ని విజ్ఞప్తి చేస్తున్నాం. డిసెంబర్ 9 తెలంగాణలో చారిత్రాత్మక రోజు సోనియా పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ లేదని, అప్పటి సీఎంగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు”అని పేర్కొన్నారు.