హైదరాబాద్, వెలుగు: ఫామ్‌హౌస్ లో పడుకున్న వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఎందుకని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. శుక్రవారం రవీంద్ర భారతిలో బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలకు ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్యోతిరావు పూలే తర్వాత ఈ దేశంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం తపనపడే మరో నేత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయేనని అన్నారు.
పదేండ్ల పాటు బీసీలను నిట్టనిలువునా ముంచి, మోసం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బీసీల సంక్షేమం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలకు తాను సవాల్ చేస్తున్నా.. వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీసీలను నియమించే ధైర్యం ఆ రెండు పార్టీలకు ఉందా అని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే కుల గణన సర్వే చేయాలని డిమాండ్ చేశారు. కులాలకు అతీతంగా ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ లో ఉంటుందని, బీఆర్ఎస్, బీజేపీలో ఆ స్వేచ్ఛ ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక యూనివర్శిటీకి జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే పేర్లను పెట్టేందుకు కృషి చేస్తామని చెప్పారు.