- కులగణన కాంగ్రెస్ పేటెంట్
- పీసీసీ కార్యవర్గంలో 60 % మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చాన్స్ ఇస్తామని వెల్లడి
- ఓబీసీల ఆధ్వర్యంలో సన్మాన సభ
హైదరాబాద్, వెలుగు : బీసీలమంతా ఐక్యంగా ముందుకుపోదామని, కులాలను పక్కనపెడదామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. కులాల వారీగా ప్రస్తావన తీసుకొస్తే, బీసీల ఐక్యత దెబ్బతింటుందని చెప్పారు. ఓబీసీల ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో మహేశ్ కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఏర్పాటు చేయనున్న పీసీసీ కార్యవర్గంలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పారు.
కులగణన జరగనిదే ఎన్నికలకు వెళ్లవద్దనే విషయంపై చర్చిస్తున్నామని పేర్కొన్నారు. ‘‘కులగణన అనేది కాంగ్రెస్ పేటెంట్. దీనిపై బీఆర్ఎస్, బీజేపీకి మాట్లాడే అర్హత లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 నుంచి 23 శాతానికి ఎందుకు తగ్గించారో కేటీఆర్ సమాధానం చెప్పాలి. ఆయనకు దమ్ముంటే బీసీ బిడ్డను బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలి” అని సవాల్ విసిరారు. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా యాక్టివ్ గా పని చేసిన బండి సంజయ్ ని ఎందుకు తొలగించారో ఆ పార్టీ హైకమాండ్ చెప్పాలి. బండి సంజయ్ కి కేబినెట్ హోదా కాకుండా, సహాయ మంత్రి పదవి ఇవ్వడం ఏమిటి?” అని ప్రశ్నించారు.
పార్టీ జెండా పట్టుకుని పైకొచ్చారు : పొన్నం
మహేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వారసత్వ రాజకీయాలతో కాకుండా, పార్టీ జెండా పట్టుకొని పైకొచ్చారని కొనియాడారు. మహేశ్ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న టైమ్ లో తాను కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశానని గుర్తు చేసుకున్నారు. తమ ప్రభుత్వం కులగణనకు కట్టుబడి ఉందని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరిగేలా రిజర్వేషన్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు.
కాంగ్రెస్ తోనే బీసీలకు న్యాయం: ఆది శ్రీనివాస్
బీసీ నేతకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తాను నిజామాబాద్ లో చదువుకున్నప్పటి నుంచి మహేశ్ కుమార్ గౌడ్ పరిచయమని చెప్పారు. కులగణనపై బీఆర్ఎస్ కు మాట్లాడే హక్కు లేదని.. వాళ్లకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే ముందు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా బీసీని నియమించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు.
‘‘అన్ని వర్గాల మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటే, అన్ని వర్గాలు ఐక్యంగా పని చేయాలి” అని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ‘‘మహేశ్ కమిట్మెంట్ ఉన్న నాయకుడు. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్.. ఇద్దరూ కలిసి జోడెద్దుల్లా పని చేస్తారు” అని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు.
కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఎమ్మెల్సీలు అమీర్ అలీఖాన్, ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ , కార్పొరేషన్ల చైర్మన్లు నిర్మలా జగ్గారెడ్డి, ఈరవత్రి అనిల్, శివసేనా రెడ్డి, ప్రీతం, మెట్టు సాయికుమార్, కాల్వ సుజాత, చల్లా నరసింహారెడ్డి, మత్తినేని వీరయ్య, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, మాజీ మంత్రి శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.