- గ్రేటర్లో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- నాయకులు కిందిస్థాయికి వెళ్లి పనిచేస్తేనే మంచి ఫలితాలు: దీపాదాస్ మున్షీ
- ప్రతి కార్యకర్త చాలెంజ్ గా తీసుకోవాలి: మంత్రి పొన్నం
- గాంధీ భవన్ లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష
హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలి ఇప్పటి నుంచే డివిజన్ల వారీగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. సోమవారం సాయంత్రం గాంధీ భవన్ లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. పీసీసీ చీఫ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్దీపాదాస్ మున్షీ, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి, ఎమ్మెల్సీ అమేర్ అలీఖాన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ పాలనకు.. ఏడాది కాంగ్రెస్ పాలనకు ఎంతో తేడా ఉందన్నారు.
కలిసికట్టుగా పనిచేస్తే గెలుపు మనదే: దీపాదాస్ మున్షీ
నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తే గ్రేటర్ ఎన్నికల్లో మనమే గెలుస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు. దాంతో కాంగ్రెస్ బలమైన పార్టీగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున జీహెచ్‌ఎంసీలో గెలుపు.. కాంగ్రెస్ కు చాలెంజ్ గా మారిందన్నారు. నాయకులు కింది స్థాయికి వెళ్లి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని, కార్యకర్తలపై ఆ బాధ్యత వేస్తే అనుకున్న ఫలితాలు రావన్నారు. నాయకులు డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీని బలోపేతం చేయాలన్నారు.
బలమైన నాయకులకే టికెట్లు: మంత్రి పొన్నం
రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ లో బలమైన నాయకులకే పార్టీ టికెట్లు ఇస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.డివిజన్లలో నిత్యం ప్రజల మధ్య ఉండే నాయకులకే టికెట్లు వస్తాయన్నారు.
గాంధీ కుటుంబ త్యాగాలను నేటి తరానికి తెలియకుండా కుట్ర
బీజేపీపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: దేశానికి గాంధీ కుటుంబం చేసిన త్యాగాలను నేటి తరానికి తెలియకుండా మోదీ సర్కార్ కుట్ర చేస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బంగ్లాదేశ్ లిబరేషన్ డే (విజయ్ దివస్) సందర్భంగా సోమవారం గాంధీ భవన్‌లో పీసీసీ ఆధ్వర్యంలో మహేశ్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పీసీసీ మేధావుల సెల్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లిబరేషన్‌పై ఏర్పాటు చేసిన సినిమా ప్రదర్శనను చూశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశానికి జవహార్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ చేసిన త్యాగాలను, వారి సేవలను దేశ ప్రజలకు తెలియకుండా బీజేపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రపంచంలోనే భారతదేశానికి గొప్ప పేరును తీసుకురావడంలో ఇందిరమ్మ సాహసాలను ఈ దేశం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుందని చెప్పారు. అనంతరం సోనియా వ్యక్తిగత కార్యదర్శి మాధవన్ మృతి పట్ల పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు.