- 1969 ఉద్యమకారుల సమితి
హైదరాబాద్, వెలుగు: ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా త్వరలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు సన్మానం చేస్తామని 1969 ఉద్యమకారుల సమితి ప్రెసిడెంట్, మాజీ మంత్రి మేచినేని కిషన్ రావు, జనరల్ సెక్రటరీ దుశ్చర్ల సుదర్శన్ రావు ప్రకటించారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను ఆదివారం కలిసి తమ ప్రతిపాదన వివరించినట్టు చెప్పారు. సీఎంతో చర్చించి తేదీ ఖరారు చేస్తానని మహేశ్ గౌడ్ హామీ ఇచ్చినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు 1969 ఉద్యమకారుల స్మృతివనం కోసం ల్యాండ్, ప్రతి నెల పెన్షన్, 300 గజాల జాగా ఇచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పీసీసీ చీఫ్ భరోసా ఇచ్చినట్లు తెలిపారు. .
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భారీగా తరలి రండి
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవారం సెక్రటేరియెట్‌లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లతో పీసీసీ చీఫ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ పాలనపై మెజార్టీ ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని తెలిపారు. ఏడాది పాలనపై ప్రభుత్వం నిర్వహించిన సభలకి ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చారని, ఈ మీటింగ్‌కు కూడా ఇదే విధంగా రావాలని ఆయన కోరారు. కాగా, తెలంగాణ తల్లి విగ్రహం, అమరవీరుల జ్యోతిని రూపొందించిన శిల్పి రమణా రెడ్డిని ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ సన్మానించారు.