హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన, కేంద్రంలో బీజేపీ పదేండ్ల పాలనపై చర్చకు సిద్ధమా? అని బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. బీజేపీ విడుదల చేసిన చార్జ్‌షీట్ చూస్తుంటే గురివింద సామెత గుర్తొస్తున్నదని విమర్శించారు. మతతత్వ రాజకీయాలు చేస్తూ, పార్టీలను చీలుస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న బీజేపీ.. ఇప్పుడు సుద్దపూస మాటలు మాట్లాడుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనపై బీజేపీ విడుదల చేసిన చార్జ్ షీట్ కు కౌంటర్ గా మహేశ్ గౌడ్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
‘‘2014, 2019, 2024 ఎన్నికల్లో జాతీయస్థాయిలో మీరు విడుదల చేసిన మేనిఫెస్టోలు తీస్కొని రండి. మేం 2023లో విడుదల చేసిన మేనిఫెస్టో తీస్కొని వస్తం. మేం ఏడాదిలో ఏమేం చేశామో చెప్తం. మీరు 10 ఏండ్లలో ఏం చేశారో చెప్పండి. దమ్ముంటే బహిరంగ చర్చకు రండి” అంటూ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేండ్లలో తెలంగాణకు ప్రత్యేకంగా ఏం చేసిందో చెప్పాలన్నారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే దాదాపు రూ.54 వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే..
బీజేపీ పాలనలో దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని మహేశ్ గౌడ్ అన్నారు. ‘‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి అకౌంట్ లో రూ.15 లక్షలు, రూ.50కే లీటర్ పెట్రోల్.. ఇలా బీజేపీ అనేక హామీలిచ్చి విస్మరించింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చింది. దేశవ్యాప్తంగా 411 మంది ఎమ్మెల్యేలను వివిధ పార్టీల నుంచి చేర్చుకుంది” అని మండిపడ్డారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని అన్నారు. ‘‘లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో బీజేపీ చీకటి ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోవడంతో చార్జ్ షీట్ అంటూ కొత్త రాజకీయాలకు తెరలేపింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ‘మోదీ గ్యారెంటీ’ పేరుతో ప్రజలను మోసం చేసింది. బీజేపీ, బీఆర్ఎస్ కవల పిల్లలు. ఒకరికొకరు ఏ టీమ్, బీ టీమ్ అనుకుంటూ చీకటి రాజకీయాలు చేస్తున్నారు” అని ఫైర్ అయ్యారు.