బీఆర్ఎస్ బీసీ సంఘాలను తప్పుదోవ పట్టిస్తోంది: మహేష్ కుమార్ గౌడ్

బీఆర్ఎస్ బీసీ సంఘాలను తప్పుదోవ పట్టిస్తోంది: మహేష్ కుమార్ గౌడ్

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎల్పీ సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సుమారు మూడు గంటలకు పైగా సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ క్రమంలో సమావేశంలో చర్చించిన అంశాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు మహేష్ కుమార్ గౌడ్.స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా కులగణన చేపట్టామని... రాహుల్ గాంధీ ఆశయం మేరకు పరిపూర్ణంగా సర్వే చేసి ఎవరు ఎంత సంఖ్యలో ఉన్నారో తేల్చామని అన్నారు. వాస్తవాలు తెలియక బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. బీఆర్ఎస్ బీసీ సంఘాలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.

చాలా అంశాలపై సీఎల్పీ సమావేశం జరిగిందని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని అన్నారు. సూర్యాపేటలో కులగణన జరిగిన తీరుపై బహిరంగ సభ నిర్వహించనున్నామని.. ఈ సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను ఆహ్వానించటానికి ఢిల్లీ వెళ్తున్నామని అన్నారు. ఈ సమావేశం ద్వారా ఎమ్మెల్యేలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేశామని అన్నారు. బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని అన్నారు మహేష్ కుమార్ గౌడ్.