ఇందిరా, రాజీవ్ విగ్రహాలపై చెయ్యేసి చూడు..మా కార్యకర్తలు బట్టలూడదీసి కొడ్తరు

ఇందిరా, రాజీవ్ విగ్రహాలపై చెయ్యేసి చూడు..మా కార్యకర్తలు బట్టలూడదీసి కొడ్తరు
  • కేటీఆర్​కు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్
  • కాంగ్రెస్ లీడర్ల సహనాన్ని పరీక్షించొద్దు
  • బీఆర్ఎస్​లో పోకిరీ ఎమ్మెల్యేలు ఉన్నారని ఫైర్

హైదరాబాద్, వెలుగు: ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలపై చెయ్యేస్తే కాంగ్రెస్ కార్యకర్తలే బట్టలూడదీసి కొడ్తారని కేటీఆర్​కు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. రెచ్చగొట్టేలా కామెంట్లు చేస్తూ.. తమ పార్టీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని సూచించారు. మూడేండ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే.. కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రిని మూటగట్టి గాంధీభవన్​కు పంపిస్తామని కేటీఆర్ చేసిన కామెంట్లకు మహేశ్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

అసెంబ్లీ మీడియా పాయింట్​లో ఆయన మాట్లాడారు. ‘‘సీఎం రేవంత్ పై కామెంట్లు చేసే అర్హత కేటీఆర్​కు లేదు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని స్ట్రెమీద పడుకోబెట్టారు. అధికారం కోల్పోయినా... కేటీఆర్, అతని ఫ్యామిలీ మెంబర్ల అహంకారం మాత్రం తగ్గలేదు. గవర్నర్​ను కూడా కేటీఆర్ అవమానిస్తున్నడు. 

ఆయన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ చిన్నపిల్లాడిలా కామెంట్లు చేస్తున్నడు. సభలో గవర్నర్ ఎలా మాట్లాడుతారనేది కనీస ఇంగిత జ్ఞానం బీఆర్ఎస్ లీడర్లకు లేదు. గతంలో మహిళా గవర్నర్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలా బిహేవ్ చేశారో తెలంగాణ ప్రజలంతా చూశారు. బీఆర్ఎస్​లో పోకిరి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ అలవాటుతోనే ఇలా కించపర్చే వ్యాఖ్యలు చేస్తున్నారు’’అని మహేశ్ గౌడ్ అన్నారు. 

అభివృద్ధి అంటే కేసీఆర్​కు ఏం తెలుసు?

పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ చేయని ఎన్నో అభివృద్ధి పనులు తాము ఏడాదిన్నరలో చేశామని మహేశ్ గౌడ్ తెలిపారు. అదే విషయాన్ని గవర్నర్ తన ప్రసంగంలో చెప్తుంటే.. బీఆర్ఎస్ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ‘‘ఫామ్​హౌస్​కు పరిమితమైన కేసీఆర్​కు అభివృద్ధి అంటే ఏం తెలుసు? కుల గణన సర్వేలో పాల్గొనని కేసీఆర్ ఫ్యామిలీకి సర్వే గురించి మాట్లాడే హక్కు లేదు. దేశ చరిత్రలో చాలా తక్కువ టైమ్​లో.. ఎక్కువ దోపిడీ చేసిన ఘనత కేసీఆర్ ఫ్యామిలీదే. మత్తులో మునిగే సంస్కృతి బీఆర్ఎస్ నేతలది. 

తెలంగాణ యువతకు మత్తు పదార్థాలను అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేసింది కేటీఆర్ కాదా? కేసీఆర్ అసెంబ్లీకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఆయన అసెంబ్లీకి వచ్చి తన అనుభవాన్ని పంచుకోవాలి’’అని మహేశ్ గౌడ్ అన్నారు.