
- కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు పీసీసీ చీఫ్ దిశా నిర్దేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని ఎమ్మెల్యే కోటాలోని కాంగ్రెస్, సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థులకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ దిశా నిర్దేశం చేశారు. మంగళవారం ఇరు పార్టీల అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యంను పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ లంచ్ కు పిలిచారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
సీపీఐకి సంపూర్ణ సహకారం అందించామని, రాబోయే రోజుల్లోనూ ఇదే విధమైన పరస్పర స్నేహం, సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు. బీఆర్ఎస్, బీజేపీ కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకొని అర్థం లేని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో చేయలేని సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. ప్రజా ప్రభుత్వంగా ప్రజల్లో అభిమానం చూరగొన్నదని, దీన్ని చూసి ఓర్వలేకే ఆ రెండు పార్టీలు సర్కార్ కు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నాయని విమర్శించారు.