
- రాష్ట్రంలో బీజేపీకి అధికారం కల్ల
- హెచ్సీయూలో జింకలున్నాయనడం నిజం కాదు
- ఢిల్లీలో బండి సంజయ్ ఇంట్లో నెమళ్లున్నయ్
- మీనాక్షి నటరాజన్ మంత్రులతో రివ్యూ చేయలే
- సెక్రటేరియట్లో కూర్చునే రైట్ అందరికీ ఉంది
- పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కల్ల అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఇవాళ గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు 11 ఏళ్లలో ఏమి తెచ్చారో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు వైట్ పేపర్ రిలీజ్ చేయాలని అన్నారు. దీనిపై తాము చర్చకు సిద్ధమని చెప్పారు. అమిత్ షాలు ఆర్డర్ వేస్తేనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు పని చేస్తారని అన్నారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 20వేల ఎకరాల ప్రభుత్వ భూములు కరిగి పోతే కిషన్ రెడ్డికి ఎందుకు పట్టదని చెప్పారు. 10వేల ఎకరాల భూములను కేసీఆర్ , కేటిఆర్ లు అమ్ముకుంటే కిషన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ఒక్క చాన్స్ కావాలని ప్రాధేయపడుతున్నారని అన్నారు. తెలంగాణకు ఏమి ఎలగబెట్టారని ఒక్క చాన్స్ అని అడుగుతున్నారని ప్రశ్నించారు. మూడోసారి కూడా మతం పేరున ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చారని అన్నారు. మెట్రో కోసం ఒక్క రూపాయి తెచ్చిన పాపాన పోలేదని అన్నారు.
మూసీ ప్రక్షాళన జరిగి హైదరాబాద్ ప్రజలు సుఖపడటం కిషన్ రెడ్డికి నచ్చదని అన్నారు. మతతత్వ రాజకీయాలను తెలంగాణ ప్రజలు కోరుకోరన్నారు. అధికారంలోకి వస్తామని కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు పగటి కలలు కంటున్నారని విమర్శించారు. సచివాలయంలో కూర్చునే అధికారం అందరికి ఉందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మీనాక్షి నటరాజన్ మంత్రులతో రివ్యూ చేసింది అనటం అవాస్తవమని చెప్పారు. హెచ్సీయూలో జింకలు ఉన్నాయనేది వాస్తవం కాదన్నారు. నెమళ్ళు ఎక్కడైన ఉండొచ్చని చెప్పారు. ఢిల్లీలో బండి సంజయ్ ఇంట్లో కూడా నెమళ్ళు ఉన్నాయని అన్నారు.