- ఆయనపై బీజేపీ కుట్ర చేస్తున్నది
- గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం
- గాడ్సే వారసులు దేశాన్ని పాలిస్తున్నరని ఫైర్
- రాహుల్‌పై బీజేపీ నేతల కామెంట్లకు నిరసనగా హనుమకొండలో ధర్నా
వరంగల్/హుజూరాబాద్, వెలుగు: గాంధీ కుటుంబం మొత్తం దేశం కోసం త్యాగాలు చేసిందని.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఏనాడైనా దేశం కోసం జైలుకైనా వెళ్లారని, కనీసం వారి ఇంట్లో కుక్క అయినా దేశం కోసం చనిపోయిందా? అని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. దేశ ప్రజలంతా ప్రధానిగా చూడాలనుకుంటున్న నేత రాహుల్‌గాంధీని పట్టుకుని ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని అన్నారు. బుధవారం ఆయన గ్రేటర్ వరంగల్‌లో పర్యటించారు. గీసుగొండలోని నాగమయ్య గుడిని, సిటీలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
రాహుల్‌గాంధీపై బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హనుమకొండ అంబేద్కర్ సెంటర్లో చేపట్టిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ‘‘గాంధీ కుటుంబంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వరకు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారు. జైలు జీవితాలు గడిపారు. దేశాన్ని ప్రస్తుతం గాడ్సే వారసులు పాలిస్తున్నారు” అని అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లో బీజేపీ వాళ్లు గాడ్సే విధానాలను అనుసరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ‘‘బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నోరు విప్పట్లేదు.
దీన్నిబట్టే వారు ఎలాంటి కుట్ర చేస్తున్నరో ప్రజలు అర్థం చేసుకోవాలి” అని అన్నారు. జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు ఓడిపోతాయన్న భయంతోనే రాహుల్‌పై ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని.. ప్రాణాలు తీస్తామంటూ బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ, పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీవి దిగజారుడు రాజకీయాలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీద ఈగ వాలినా ఊరుకునేది లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మతాల పేరిట ఓట్లు చీల్చి మోదీ ప్రధాని అయ్యారు. బీజేపీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారు. రానున్న ఎన్నికలలో ఆ పార్టీకి100 సీట్లు కూడా రావు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ దేశవ్యాప్తంగా ఆదరణ వచ్చింది. దీంతో బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తూ గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నది” అని మండిపడ్డారు.