
- బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలను ఎమ్మెల్సీగా చేయడమే అందుకు నిదర్శనం
- పీసీసీ చీఫ్మహేశ్ కుమార్ గౌడ్
- దేశవ్యాప్తంగా కులగణనతో పాటు జనగణన చేయాలని డిమాండ్
- అసెంబ్లీలో జగదీశ్ రెడ్డి తీరు సరికాదని కామెంట్
హైదరాబాద్, వెలుగు: సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ తరపున కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు విజయ శాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ తో కలిసి గురువారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. కులగణన సర్వేకు భయపడి దాసోజు శ్రవణ్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా కులగణనతో పాటు జనగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
తమ ఎంపీ రాహుల్ గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో కులగణనను విజయవంతంగా పూర్తిచేసి దేశానికే స్ఫూర్తిగా నిలిచామన్నారు. కులగణన లెక్కలను అనుసరించి బీసీలకు రాజకీయ, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అయినా ప్రతిపక్షాలు స్పందించడం లేదని, ఈ సర్వే గురించి కేటీఆర్, హరీశ్ రావుకు మాట్లాడే అర్హత లేదన్నారు. బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చట్టసభల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. కేంద్రం ఆ తీర్మానం ఆమోదించేలా బీజేపీ, బీఆర్‌ఎస్ ఒత్తిడి తేవాలన్నారు. ఇక అసెంబ్లీలో దళిత స్పీకర్ తో బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ప్రజాస్వామ్యం, రాజకీయ విలువల గురించి కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. 2014 లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వం రద్దు చేశారని గుర్తుచేశారు.
తక్కువ టైంలో కేసీఆర్ ఫ్యామిలీ రికార్డు దోపిడీ
దేశ చరిత్రలో తక్కువ సమయంలో రికార్డు స్థాయిలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని లూటీ చేసిందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అసెంబ్లీలో దళితుడికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తూ స్పీకర్ పదవి ఇస్తే, స్పీకర్‌ను కించపరిచేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. దళితులను చిన్నచూపు చూడడం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందన్నారు. ఇక విజయశాంతి గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలక పాత్ర పోషించారని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని తెలిపారు.
తెలంగాణ వ్యతిరేక శక్తులకు బీజేపీ అండ: విజయశాంతి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలో బీజేపీ ఇప్పటి నుంచే తన ఆపరేషన్ ను ప్రారంభించిందని ఎమ్మెల్సీగా ఎంపికైన విజయశాంతి అన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులను రాష్ట్రంలో బీజేపీ దించబోతోందని ఆమె పేర్కొన్నారు. అందుకే బీజేపీ తెలంగాణ ఉద్యమకారులపై కుట్రలు చేస్తోందని విమర్శించారు.
తనకు ఎమ్మెల్సీ ఇస్తే బీజేపీకి ఎందుకంత అక్కసు అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం తన ఆస్తులు అమ్మేశానని, తాను పెట్టిన తల్లి తెలంగాణ పార్టీని కేసీఆర్... నాటి టీఆర్ఎస్ లో విలీనం చేయాలని ప్రాధేయపడితే, రాష్ట్ర సాధనను దృష్టిలో పెట్టుకొని విలీనం చేశానని చెప్పారు.