- లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు
- మీడియాతో చిట్ చాట్లో పీసీసీ చీఫ్ మహేశ్
హైదరాబాద్, వెలుగు: త్వరలోనే పీసీసీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ స్టేట్ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. అధికారంలో ఉన్నందున పీసీసీ కార్యవర్గంలో పదవులను బాగా కుదిస్తామని తెలిపారు. శనివారం గాంధీ భవన్ లో మీడియాతో మహేశ్ చిట్ చాట్ చేశారు. జిల్లాల్లో పార్టీ బలోపేతంపై దృష్టిసారిస్తామని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేలకే డీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు.
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అనుకున్నన్ని సీట్లు ఇవ్వలేకపోయాం. ఆ లోటును త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికలతో భర్తీ చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ చీఫ్ గా సమర్థత ఉన్న నేతనే నియమిస్తాం. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లొంగేది లేదు. కొన్నిచోట్ల పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. వాటిపై పార్టీ పరంగా దృష్టి పెట్టి సరిదిద్దుతాం. కొన్నిచోట్ల పార్టీ నేతలు, ఇతర పార్టీల నుంచి చేరినోళ్లకు మధ్య సమన్వయం లేదు. పాత, కొత్త నేతల మధ్య సమన్వయంపై దృష్టిపెడతాం” అని తెలిపారు.
హరీశ్ కు వాళ్ల కన్నీళ్లు కనిపించలేదా?
హైడ్రా బాధితులను చూసి కన్నీళ్లు పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు ఇన్నేండ్లు మల్లన్నసాగర్ భూనిర్వాసితుల కన్నీళ్లు కనిపించలేదా? అని మహేశ్ ప్రశ్నించారు. ఆనాడు మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రతిపక్ష నేతలుగా తాము వాళ్లను పరామర్శించేందుకు వెళ్తే అడ్డుకొని అరెస్టు చేశారని గుర్తుచేశారు. హరీశ్ కన్నీరుకార్చి పేదల సానుభూతి పొందాలనే ప్రయత్నం చేసినా జనం మాత్రం నమ్మరని అన్నారు. మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం తప్పకుండా ప్రత్యామ్నాయం చూపుతుందని చెప్పారు.