- మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడ్తున్నది
- రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నది: పీసీసీ చీఫ్ మహేశ్
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగ మూల సూత్రాలను బీజేపీ తుంగలో తొక్కేసి దేశాన్ని పాలిస్తున్నదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని.. సంఘ్‌పరివార్, బీజేపీ తమకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని ఫైర్ అయ్యారు. మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. గాంధీభవన్‌లో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సంవిధాన్ దివస్‌కు మహేశ్ గౌడ్.. చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు.
రాజ్యాంగ విధానాలకు విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తున్నది. బీజేపీ బెదిరింపులకు రాహుల్ గాంధీ భయపడకుండా రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాటం చేస్తున్నారు. దేశంలో మొదటిసారి తెలంగాణలో కుల గణన చేస్తున్నం. రాహుల్ ఆధ్వర్యంలో మేధావుల సలహాలు, సూచనలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అందుకే దేశవ్యాప్తంగా కుల గణన చేయాలనేదే మా డిమాండ్. రాహుల్ గాంధీని ప్రధాని చేసే దాకా ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కష్టపడి పని చేయాలి’’అని మహేశ్ గౌడ్ కోరారు.
రాజ్యాంగంపై స్టూడెంట్లకు అవగాహన కల్పించాలి
పాఠ్యపుస్తకాల్లో రాజ్యాంగ పీఠిక ఉండేలా చూడాలని సీఎం రేవంత్‌ను కోరుతున్నామని మహేశ్ గౌడ్ తెలిపారు. 8వ తరగతి నుంచే రాజ్యాంగం అంటే తెలిసేలా పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. స్పెషల్ గెస్ట్‌గా హాజరైన ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి మాట్లాడారు. దేశంలో మత సామరస్యం, సమానత్వం ఉండాలన్నారు. కుల గణన ఎంతో అవసరమన్నారు. అప్పుడే ప్రతీ పేదోడికి ప్రభుత్వ పథకాలు అందుతాయని తెలిపారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం రాహుల్ పరితపిస్తున్నారని అన్నారు.
రాజ్యాంగ విధానాలు అమలు చేస్తేనే అనుకున్నది సాధ్యమవుతుందని తెలిపారు. సొంత పార్టీకి చెందినవాళ్లే తనపై కుట్రలు చేస్తున్నారని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి ఆరోపించారు. 12 ఏండ్లు పార్టీ కోసం పని చేస్తే.. ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ పదవి వచ్చిందన్నారు. కాగా, అంతకు ముందు పీసీసీ ఇంటలెక్చువల్ సెల్ ఏర్పాటు చేసిన 75 ఏండ్ల రాజ్యాంగంపై నిర్వహించిన మీటింగ్ లోనూ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పాల్గొన్నారు. ఆ తర్వాత పీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో సంవిధాన్ దివస్ నిర్వహించారు. ఇందులో పీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్, ఇతర నేతలు పాల్గొన్నారు.