- ఆమె పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా జరుపుతం: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
- కేసీఆర్ ఫామ్ హౌస్‌ను వీడి ఏడాది పండగలో పాల్గొనాలి
- దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణాలు ఇచ్చింది
- తెలంగాణ కోసం కేటీఆర్ ఏమిచ్చాడని నిలదీత
- అధికారం పోయినా ఆయనలో అహం తగ్గలేదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినాన్ని ఈనెల 9న రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అనుంబంధ సంఘాల ఆధ్వర్యంలోనూ సోనియా పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తామన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ ను కూడా ఆహ్వానిస్తామన్నారు.
కేసీఆర్ తన ఫాంహౌస్ వీడి ఏడాది పండగలో పాల్గొనాలని ఆయన కోరారు. ఇది రాష్ట్ర ప్రజల పండగ అని, ప్రతిఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సోనియా లేనిదే తెలంగాణ లేదన్నారు. రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించిందని, తెలంగాణ కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం త్యాగం చేశారని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో ఇచ్చినన్ని ఉద్యోగాలను కాంగ్రెస్ ఏడాదిలోనే ఇచ్చిందన్నారు. అధికారం పోయినా కేటీఆర్ లో అహంకారం ఏమాత్రం తగ్గలేదని ఫైర్ అయ్యారు.
ఇప్పటికైనా కేటీఆర్ పగటికలలు కనడం మానేయాలని హితవు పలికారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ నేతలు అనడంపై మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రూ.లక్షల కోట్లు దోపిడీకి పాల్పడ్డ బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదు.
దేశంలో అతితక్కువ సమయంలో అతిఎక్కువగా దోచుకున్నది కేసీఆర్ కుటుంబమే. కాంగ్రెస్ పార్టీ పెడుతున్న విగ్రహం తెలంగాణను ప్రతిబింబించేలా ఉంది. బీఆర్ఎస్ పెట్టిన విగ్రహం దొరతనానికి ప్రతిబింబంగా ఉంది. వారు వైఢూర్యాల తల్లిని ఏర్పాటు చేస్తే, మేము బడుగుబలహీన వర్గాల తల్లిని ఏర్పాటు చేస్తున్నాం” అని మహేశ్ కుమార్ పేర్కొన్నారు.
రేవంత్ పాలనలో నిర్బంధం లేదు
సీఎం రేవంత్ పాలనలో ఎక్కడా ఎలాంటి నిర్భంధం లేదని, ప్రతిఒక్కరికీ స్వేచ్ఛగా నిరసన తెలుపుకునే అవకాశం ఉందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకునేది లేదన్నారు. బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుతో తండ్రి, కొడుకులు తప్ప ఎవరు ఆ పార్టీలో ఎవరూ మిగిలే పరిస్థితి లేదన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాడిన భాష సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు.
పార్టీ పెద్దగా కేసీఆర్ ఆయనను మందలించడం లేదన్నారు. లూటీ చేశారు కాబట్టే హరీశ్ పై కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. కిస్మత్ రెడ్డి లా మారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేయాల్సి వస్తే పారిపోయిన వ్యక్తి కిషన్ రెడ్డి అని ఆరోపించారు. తెలంగాణకు ఆయన చేసిన మేలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ గురించి మాట్లాడే బీజేపీ నేతలు.. సబర్మతి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అక్కడ పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. పేదల గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు.