
హైదరాబాద్: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను ఐంఎంజీ భరత్ అనే సంస్థకు, బిల్లి రావ్ అనే వ్యక్తికి కట్టబెట్టారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. వాటిని వెనక్కి తీసుకొచ్చింది దివంగత వైఎస్సార్.. ఆయనే కోర్టును ఆశ్రయించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆ తర్వాత పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూముల విషయాన్ని పట్టించుకోలేదని అన్నారు. అప్పుడు హెచ్సీయూ భూమి ఇదని కనిపించలేదా..? అని ప్రశ్నించారు. పదేండ్ల కాలంలో అదే ఐఎంజీ సంస్థతో 30% ముడుపులు మాట్లాడుకొన్నారని అన్నారు. ఇవాళ కేటీఆర్ మాట్లాడే 5,200 కోట్లు ఆయనకు రావాల్సిన లంచమని ఆరోపించారు.
కేటీఆర్ దురదృష్టానికి తాము అధికారంలోకి వచ్చామని అన్నారు. ఇది ప్రభుత్వ భూమి అని, టీఎస్ఐఐసీకి 75 కోట్లకు ఎకరం చొప్పున సర్కారు ఇచ్చిందని అన్నారు. వాటిని తనఖా పెట్టి ప్రభుత్వం ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ. 10 వేల కోట్ల రుణం తెచ్చిందని చెప్పారు. ఆ పది వేల కోట్లను రైతు రుణమాఫీకి, సన్న వడ్లకు ఇచ్చిన బోనస్ కు వినియోగించిందని క్లారిటీ ఇచ్చారు. ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి పోలేదని అన్నారు. రైతులు బాగుపడుతుంటే కేటీఆర్ కడుపునొప్పితోనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 175 కోట్ల అంశం లేవనెత్తారని అన్నారు.
లోన్లు కావాలంటే ప్రభుత్వం ఏదో ఒక ఏజెన్సీని ఆశ్రయించాలని, ఇది అన్ని ప్రభుత్వాలు చేసే పనే అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. లోన్ కోసం ట్రస్ట్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీకి బాధ్యతలు అప్పగించామని చెప్పారు. దానికి 175 కోట్ల రూపాయల వైట్ మనీని ఖాతాలోకి బదిలీ చేసిందని చెప్పారు. దీనికి ఇంకేదో కుంభకోణం జరిగిందని రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఇక్కడ భూములకు ధర లేదని చెబుతున్నారని, వాళ్ల హయాంలో కోకాపేటలో ఎకరం వంద కోట్లు అమ్ముకున్నారని ఆయన గుర్తు చేశారు. దీనిపై రియల్ ఎస్టేట్ కంపెనీల కన్నా అడ్వర్టైజ్ చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ సర్కారుదని అన్నారు.
కోకాపేట్లో వంద కోట్లకు ఎకరం పలికినప్పుడు.. ఇక్కడ వంద కోట్లకు ఎందుకు పలుకదని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థకు తాము రూ. 75 కోట్లకు ఇచ్చామని చెప్పారు. తాము రుణంగా తీసుకున్న డబ్బును రైతుల కోసం ఖర్చు చేశామని వివరించారు. ఇందులో కాంగ్రెస్ నాయకులు ఏమీ చెందలేదని అన్నారు. ఏఐ టెక్నాలజీ వినియోగించి జింకులు దుంకుతున్నట్టుగా నెమళ్లు పరిగెత్తుతున్నట్టుగా చిత్రీకరించారని అన్నారు.