- రూ.141 కోట్ల టెండర్లు అప్పగించినం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- 18 నెలల్లో డీపీఆర్ ఇవ్వాలని సూచించినం
- ప్రభుత్వాన్ని కూల్చుతామంటేనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వచ్చిన్రు
- హైకమాండ్ నిర్ణయంతో చేరికలు
హైదరాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ కోసం డీపీఆర్ (డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు)ను రూపొందించే బాధ్యతను ప్రపంచంలోనే పేరున్న ఐదు ప్రముఖ కంపెనీలకు అప్పగించామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. దీని కోసం రూ.141 కోట్ల టెండర్‌ను ఆ కంపెనీలకు ఇచ్చామన్నారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘18 నెలల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు ఆ కంపెనీలకు గడువు విధించాం. మూసీ పునరుజ్జీవం ఎలా చేయాలి? అవసరమయ్యే నిధులను ఎలా సమీకరించుకోవాలనే దానిపై కూడా సలహాలు, సూచనలు ఇస్తాయి. ప్రతిపక్షాలు మాత్రం మూసీ ప్రక్షాళన కోసం ప్రభుత్వం లక్షన్నర కోట్లు ఖర్చు పెడ్తున్నదంటూ బురదజల్లడమే పనిగా పెట్టుకున్నాయి’’అని మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయం మేరకే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి చేర్చుకుంటున్నామని తెలిపారు.
గంగారెడ్డి హత్యపై విచారణ జరుగుతున్నది
‘‘ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ బీఆర్ఎస్ కీలక నేతలు పదేపదే హెచ్చరించారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ముందుకొచ్చి మా సర్కార్‌కు మద్దతుగా నిలిచారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్లు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట నిజమే. ఈ విషయమై నేను, సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ముందుకెళ్తాం.
జగిత్యాలతో పాటు మరికొన్ని చోట్ల ఇలాంటి సమస్యలు ఉన్నయ్’’అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కొత్తగా వచ్చిన నేతలు పాత వారితో కలిసిపోవాలని సూచించారు. ‘‘ఏ ఒక్క కార్యకర్తనూ చేజార్చుకోం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియర్ నేత. ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసే బాధ్యత మాదే. గంగారెడ్డి హత్య ఘటనపై విచారణ సాగుతున్నది. త్వరలోనే అన్ని విషయాలు బయటికి వస్తయ్. జీవన్ రెడ్డి ఆవేదనను అర్థం చేసుకున్నం’’అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ధరణితో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డరు
రైతుల పాలిట ధరణి సమస్యల పుట్ట అని, ఆ పోర్టల్ వాళ్లకు శాపంగా మారిందని మహేశ్ గౌడ్ అన్నారు. ‘‘రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ధరణిని కేసీఆర్ తీసుకొచ్చారని అనుకున్నాం. కానీ.. ఊరు, పేరు లేని కంపెనీకి ధరణి బాధ్యతలు అప్పగించిన్రు. దీంతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్తున్నరు. హరీశ్, కేటీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకుని భూములు కొల్లగొట్టిన్రు. అందుకే ఎన్నో ఏండ్లుగా ప్రజలకు సేవ చేస్తున్న ఎన్ఐసీకి ధరణి బాధ్యతలు అప్పగించినం’’అని మహేశ్ గౌడ్ అన్నారు.