త్వరలోకేబినెట్​ విస్తరణ.. కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు

త్వరలోకేబినెట్​ విస్తరణ.. కులగణన తర్వాతే  స్థానిక ఎన్నికలు
  • కులగణన తర్వాతే  స్థానిక ఎన్నికలు: పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​
  • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బీఆర్​ఎస్​ విచ్ఛిన్నం చేసింది
  • సోషల్​ మీడియాలో గులాబీ దండు సెన్స్​లెస్​ ప్రచారం
  • పదేండ్లలో బీఆర్​ఎస్​ ఇచ్చింది 30 వేల కొలువులే
  • పది నెలల్లో తాము 50 వేల జాబ్స్​ ఇచ్చామని వెల్లడి

నిజామాబాద్,  వెలుగు: త్వరలోనే రాష్ట్ర కేబినెట్​ విస్తరణ ఉంటుందని పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​గౌడ్​ వెల్లడించారు. హర్యానా, జమ్మూకాశ్మీర్​ ఎన్నికల కారణంగా హైకమాండ్​ బిజీగా ఉండడంతో కేబినెట్​ విస్తరణ వాయిదా పడుతూ వచ్చిందని ఆయన తెలిపారు. కులగణన తర్వాతే లోకల్​బాడీ ఎన్నికలకు వెళ్లాలనే కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. సోమవారం నిజామాబాద్​ డీసీసీ ఆఫీస్​లో మీడియాతో మహేశ్​గౌడ్​ మాట్లాడారు. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు గెలిచిన అసెంబ్లీ సెగ్మెంట్లలో  పార్టీ ఇన్​చార్జ్​గా వారే వ్యవహరిస్తారని, ఓడిన సెగ్మెంట్లలో అభ్యర్థులకు ఇన్​చార్జ్​ బాధ్యతలు అప్పగించామని చెప్పారు. ఇతర పార్టీల నుంచి  గెలిచి కాంగ్రెస్​లో చేరిన ఎమ్మెల్యేలతో కొన్ని చోట్ల కొత్త, పాత సమస్య వస్తున్నదని.. దానిని పరిష్కరిస్తామన్నారు. అంతిమంగా కార్యకర్తలకు నష్టం కలుగకుండా చూడడం తమ బాధ్యత అని ఆయన చెప్పారు. 

అబద్ధాల ప్రచారంలో బీఆర్​ఎస్​

బీఆర్​ఎస్​ పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేశారని, ఆ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని పీసీసీ  చీఫ్​  మహేశ్​ గౌడ్​ అన్నారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుసాగుతున్నామని తెలిపారు. ‘‘బీఆర్​ఎస్​ పార్టీ దుకాణం బందైందన్న ఆందోళనతో సోషల్​ మీడియాను ఆ పార్టీ సెన్స్​లేకుండా వాడుకుంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే నాడు సోనియాగాంధీ నేతృత్వంలోని యూపీఏ సర్కార్​ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. పదేండ్ల బీఆర్ఎస్​ గవర్నమెంట్​ 30 వేల జాబ్స్​ మాత్రమే ఇవ్వగా.. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లో 50 వేల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చింది” అని ఆయన పేర్కొన్నారు. రైతు రుణ మాఫీ విషయంలో అపోహలను వ్యాప్తి చేసేందుకు బీఆర్​ఎస్​ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని, గతంలో రైతులను మోసం చేసిన అనుభవంతో వాళ్లు కామెంట్లు చేస్తున్నారని  మండిపడ్డారు. ‘‘సోషల్​ మీడియాలో బీఆర్​ఎస్​ చేసే విష ప్రచారంతో ఆ పార్టీ నేతలు తాత్కాలిక ఆనందం పొందుతున్నారు. వారిని ప్రజలు నమ్మరు. సోషల్​ మీడియాలో చేసే బీఆర్​ఎస్​ తప్పుడు ప్రచారాలు సక్సెస్​ కాకపోవడంతో ఆ పార్టీ  నేతలు  ఫ్రస్ట్రేషన్​కు లోనవుతున్నారు. ఈ విషయంలో బీజేపీ కూడా తక్కువేమీ కాదు” అని ఆయన విమర్శించారు. 

నిజామాబాద్​కు మరో మెడికల్​ కాలేజీ అవసరం

దసరా కానుకగా నిజామాబాద్​కు యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూల్​ మంజూరైందని పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ తెలిపారు. జిల్లాకు మరో మెడికల్​ కాలేజీ అవసరమని అభిప్రాయపడ్డారు. పారిశ్రామికంగా నిజామాబాద్​ జిల్లాను డెవలప్​ చేయడానికి సీఎం రేవంత్​రెడ్డితో చర్చిస్తానని.. ప్రాణహిత 20, 21 ప్యాకేజీ పనులు పూర్తి చేయిస్తానని తెలిపారు. ఆర్వోబీ నిర్మాణాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, ఈ విషయంలో నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు. ‘‘ఎన్నికల తర్వాత రాజకీయాలు వద్దు. అందరం కలిసి రాష్ట్రాభివృద్ధికి సంకల్పం తీసుకుందాం. నిజామాబాద్​ను స్మార్ట్​ సిటీ కోసం ఎంపిక చేయాలి” అని కోరారు. కార్యక్రమంలో నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతిరెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్​ తాహెర్​ తదితరులు పాల్గొన్నారు.