- పీసీసీ మీటింగ్‌లో తీర్మానం చేశాం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: దేశ వ్యాప్తంగా ఓబీసీ కులగణన చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ పీసీసీ సమావేశంలో తీర్మానం చేసినట్లు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. బుధవారం గాంధీ భవన్ లో కుల గణనపై సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పీసీసీ మీటింగ్ లో చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తామన్నారు. దేశ వ్యాప్తంగా జనగణన చేస్తామని కేంద్రం అంటున్నదని, దీనిని ఓబీసీ కులగణనగా నిర్వహించాలని పీసీసీ డిమాండ్ చేస్తున్నదన్నారు.
ప్రధాని మోదీ ఓబీసీ అని చెప్పుకోవడం తప్ప ఆయన ఈ సామాజిక వర్గానికి చేసిందేమీ లేదన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై చర్యలు లేవన్న భావన ప్రజల్లో ఉందని, కానీ గత ప్రభుత్వం మాదిరిగా తొందరపాటు చర్యలు ఉండవని చెప్పారు. సమగ్ర వివరాల సేకరణ తర్వాతే చర్యలు తీసుకుంటామన్నారు. రాహుల్ గాంధీ ఈ దేశానికి భవిష్యత్తు అని మహేశ్‌గౌడ్ చెప్పారు. దేశంలో ఏ సామాజిక వర్గాలు ఎంత శాతం ఉంటే.. వారికి అదే స్థాయిలో వాటా రావాలని గళం విప్పిన నేత రాహుల్ అని అన్నారు.
కాంగ్రెస్ అగ్ర నేతలు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి కులగణనపై జీవో తీసుకువచ్చి రాష్ట్రంలో సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. నవంబర్ 2న అన్ని జిల్లాల్లో స్థానిక కాంగ్రెస్ నేతలతో కులగణనపై సమావేశాలు జరుగుతాయన్నారు. వచ్చే నెల 5 లేదా 6న రాష్ట్రంలోని పార్టీ ముఖ్య నేతలతో కులగణనపై సమావేశం ఉంటుందని, డిసెంబర్ 7 వరకు దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నామని చెప్పారు.