- ఆయన చేసిన తప్పులకు మూడేండ్లు సరిపోదు: పీసీసీ చీఫ్ మహేశ్
- పార్టీలో చేరికలు ఆపలే.. కాస్త బ్రేక్ ఇచ్చాం
- త్వరలోనే బీఆర్ఎస్ నుంచి మరిన్ని చేరికలు
- కేటీఆర్ సన్నిహితులే టచ్‌లో ఉన్నారని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: పార్టీలో చేరికలను ఆపలేదని, కాస్త బ్రేక్ ఇచ్చామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. త్వరలో బీఆర్ఎస్ నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని చెప్పారు. ‘‘కేటీఆర్‌తో ఇన్ అండ్ ఔట్‌గా ఉన్నోళ్లే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే తమతో టచ్‌లో ఉన్నారని బీఆర్ఎస్ వాళ్లు చెప్పుకుంటున్నరు. బీఆర్ఎస్లో ఉన్నోళ్లను కాపాడుకునేందుకే అట్ల చెప్పుకుంటున్నరు” అని అన్నారు.
ప్రతిపక్ష నేత కేసీఆర్ పది నెలలుగా కనిపించడం లేదని విమర్శించారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మహేశ్ చిట్ చాట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని ఆయన తెలిపారు. ‘‘ప్రభుత్వం ఏ కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం లేదు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, భూ ఆక్రమణలు.. ఇలా అన్ని కేసులు విచారణలో ఉన్నయ్” అని తెలిపారు. ‘జైళ్లకు భయపడం’ అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించారు. ‘‘గత పదేండ్లలో కేటీఆర్ చేసిన తప్పులకు మూడేండ్ల జైలు శిక్ష సరిపోదు. ఆయనను 10 నుంచి 14 ఏండ్లు జైల్లో పెట్టాలి” అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని.. అవన్నీ బయటకు రావాలన్నారు.
‘మహా’ఎన్నికల తర్వాతే పీసీసీ కమిటీలు..
వచ్చే పదేండ్లు రాష్ట్రంలో అధికారం తమదేనని మహేశ్ అన్నారు. 2028లో కేంద్రంలోనూ అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పుడు జరిగినవి సెమీ ఫైనల్స్ మాత్రమేనని, 2028లో జరిగే ఎన్నికలే ఫైనల్స్ అని పేర్కొన్నారు. ‘‘మహారాష్ట్ర ఎన్నికల తర్వాతే పీసీసీ నూతన కార్యవర్గ నియామకం ఉంటుంది. ఈ కమిటీల్లో డీసీసీలు, ఎమ్మెల్యేలతో పాటు సమర్థులకు స్థానం ఉంటుంది” అని చెప్పారు.
మంత్రివర్గ విస్తరణ అంశం ఏఐసీసీ, సీఎం పరిధిలో ఉంటుందని.. తాను కేవలం పార్టీ వ్యవహారాలు మాత్రమే చూస్తున్నానని పేర్కొన్నారు. కేసీఆర్ లెక్క తాము ప్రజలను మోసం చెయ్యమని, హామీలన్నీ అమలు చేస్తామన్నారు. ‘‘ప్రభుత్వానికి నెలకు దాదాపు రూ.18 వేల కోట్ల ఆదాయం ఉంటే, అందులో రూ.11 వేల కోట్లు కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీలే కడుతున్నది. మిగిలిన డబ్బుతో ఉద్యోగులకు జీతాలిస్తూ సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నది” అని చెప్పారు. భవిష్యత్ తరాల కోసమే హైడ్రా తీసుకొచ్చామని, మూసీ పునరుజ్జీవం చేపట్టామని వెల్లడించారు.
పొంగులేటి.. ఏ బాంబు పేలుస్తరో!
మంత్రి పొంగులేటి పేల్చబోయే బాంబు కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానని మహేశ్ అన్నారు. ఏం చెప్తారోనని ఆసక్తిగా చూస్తున్నట్టు తెలిపారు. సీఎం, పీసీసీకి చెప్పకుండా మంత్రులు పేల్చే బాంబులతో ఇబ్బంది ఉండదా? అని ప్రశ్నించగా.. ‘అది మంచి అయితే పార్టీపరంగా, చెడు అయితే వ్యక్తిగతంగా చూడాలి. జీవన్ రెడ్డి అనుచరుడి హత్యతో మనస్తాపానికి గురయ్యానని, ఆయన వెంట ఉంటామని అన్నారు.