బీసీ రిజర్వేషన్లపై కేంద్రమంత్రులు ప్రధాని అపాయింట్మెంట్ కోరాలి:పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్

బీసీ రిజర్వేషన్లపై కేంద్రమంత్రులు ప్రధాని అపాయింట్మెంట్ కోరాలి:పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్
  • సీఎం సహా అందరం మీతో కలిసి వస్తాం: పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్​
  • బీఆర్ఎస్  పాలనలో పెద్ద ఎత్తున ఆర్థిక, ఆస్తుల విధ్వంసం 
  • వాళ్లు మళ్లీ అధికారంలోకి రావడం పగటి కలే
  • వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో  బీఆర్ఎస్ ఉండదని కామెంట్​
  • కేంద్ర మంత్రిగా సంజయ్ చెబితే.. 
  •  24 గంటల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తం: మంత్రి పొన్నం

న్యూఢిల్లీ, వెలుగు: బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ నేతలకు చిత్తశుద్ధి లేదని పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​గౌడ్​ అన్నారు. మతం, కులం పేరుతో బీసీలకు అన్యాయం చేసేలా బీజేపీ కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. బీసీలపై  ప్రేమ ఉంటే.. కేంద్ర మంత్రులు, ముగ్గురు బీసీ ఎంపీలు లక్ష్మణ్, ఈటల, ధర్మపురి కలిసి  ప్రధాని  మోదీ అపాయింట్ మెంట్ తీసుకోవాలని సవాల్​ చేశారు.

 సీఎం రేవంత్ సహా అందరం కలిసి వచ్చి బీసీ రిజర్వేషన్ల కోసం మోదీకి విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, శ్రీహరి ముదిరాజ్, మక్కాన్ సింగ్ ఠాకూర్ తో కలిసి పీసీసీ చీఫ్ మహేశ్​గౌడ్​ మీడియాతో మాట్లాడారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి  ప్రభుత్వానిదేనని, ప్రతిపక్షాలు దురుద్దేశంతోనే అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో పెద్దఎత్తున ప్రభుత్వ ఆస్తుల, ఆర్థిక విధ్వంసం జరిగిందని  అన్నారు. 

హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను వారి దగ్గరివాళ్ల సంస్థలకు కారుచౌకగా కేటీఆర్ కట్టబెట్టారని ఆరోపించారు. పదేండ్లలో బంగారంలాంటి భూములను దోచుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర ముఖచిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన విధ్వంసంపై ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని కేటీఆర్ కు మహేశ్​గౌడ్​ సవాల్ విసిరారు. 

బండి సంజయ్​కి అవగాహన లేదు: పొన్నం

బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లు రాష్ట్రమే చేసుకోవచ్చని అంటున్నారని, అదే విషయాన్ని కేంద్ర మంత్రి హోదాలో అధికారికంగా చెబితే 24 గంటల్లో రాష్ట్రంలో స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపిస్తామన్నారు. మతం పేరు చెప్పి.. బీసీలకు బీజేపీ అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. నిజంగా మతపర రిజర్వేషన్లే ఇవ్వకపోతే, ఈడబ్ల్యూసీలో ఆ వర్గానికి మోదీ ఎలా రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ప్రశ్నించారు.  

కేంద్ర మంత్రులుగా సంజయ్, కిషన్ రెడ్డి.. బీసీ ప్రధాని అని చెప్పుకునే మోదీని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి అడగాలని, అందులో మైనార్టీలకు రిజర్వేషన్లు ఎలా ఇచ్చారని నిలదీయాలని డిమాండ్ చేశారు.  గుజరాత్​ సీఎంగా మోదీ.. అక్కడ మైనార్టీల్లోని 70 వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేశారని ఓ వీడియోను మీడియాకు చూపించారు. అంటే గుజరాత్ లోని ముస్లింలకు ఒక న్యాయం, తెలంగాణ లోని ముస్లింలకు మరో న్యాయమా? అని పొన్నం ప్రశ్నించారు. ఎన్డీయే సంకీర్ణ సర్కార్ ఉన్న ఏపీలో 4 శాతం ముస్లిం రిజర్వేషన్స్ అమలవుతున్నాయని, వాటిని తీసే దమ్ము బీజేపీ నేతలకు ఉందా? అని నిలదీశారు.

మరో ఇద్దరు బీసీలకు మంత్రివర్గంలో చోటివ్వాలని కోరా..

రాష్ట్ర కేబినెట్​ విస్తరణ ఎప్పుడన్నది అధిష్టానం పరిధిలో ఉందని మహేశ్​గౌడ్​ తెలిపారు. కేబినెట్​ కూర్పు పై సీఎం, డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఇన్​చార్జి, తనతో  హై కమాండ్ వ్యక్తిగతంగా, సమిష్టిగా మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నదని చెప్పారు. అయితే, రాష్ట్ర కేబినెట్ విస్తరణలో మరో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించాలని పీసీసీ చీఫ్ గా అధిష్టానాన్ని తాను కోరినట్టు తెలిపారు.  

కేబినేట్ లో రిజర్వేషన్ల అమలుకు ప్రాంతం, గెలిచిన ఎమ్మెల్యేలు, ఇతర ఇబ్బందికర అంశాలు ఉంటాయన్నారు. మిగిలిన స్థానాల కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారని చెప్పారు.