- సర్పంచుల ఆత్మహత్యకు గత ప్రభుత్వమే కారణం:పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
- ఇందిరా భవన్లో పంచాయతీ రాజ్ సంఘటన్ సమావేశం
- పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని కేడర్ కు దిశానిర్దేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఇందిరా భవన్ లో పంచాయతీ రాజ్ సంఘటన్ రాష్ట్ర స్థాయి సదస్సు ఆ సంస్థ అధ్యక్షుడు సిద్ధేశ్వర్ అధ్యక్షతన జరిగింది. దీనికి మహేశ్ కుమార్ గౌడ్ చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ కేడర్ కు సూచించారు. గడిచిన ఏడాదిలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని జనంలోకి తీసుకెళ్లి ఓట్లు అడగాలన్నారు. గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తల కృషి వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
73, 74 రాజ్యాంగ సవరణలతోనే గ్రామాలకు హక్కులు వచ్చాయని, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కృషి ఫలితంగా పంచాయతీలకు గౌరవం దక్కిందన్నారు. అయితే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీలను నిర్లక్ష్యం చేసిందని, సర్పంచులు చేయించిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో వారు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన మండిపడ్డారు.
కేసీఆర్ తన పదేండ్ల పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. పంచాయతీ సంఘటన్ జాతీయ అధ్యక్షుడు హర్షవర్ధన్ సక్ఫాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంచాయతీ రాజ్ సంఘటన్ బలంగా ఉందన్నారు. జాతీయ స్థాయిలో తమ సంస్థ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో ఆచరణలో పెట్టారని అన్నారు. ఈ సంస్థ కార్యకలాపాలను జిల్లా స్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు.