హైదరాబాద్, వెలుగు: ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా కీలకంగా మారిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు . కాంగ్రెస్ పార్టీపై, రాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై రాష్ట్రంలోని కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ల సమావేశం జరిగింది. గురువారం గాంధీ భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి చీఫ్ గెస్టుగా మహేశ్ కుమార్ హాజరై, మాట్లాడారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలతో 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ కూడా సోషల్ మీడియాపై కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాంగ్రెస్‌పై, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తుందని ఆరోపించారు. ఇలాంటి వాటిని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ప్రతినిధుల కష్టాలను గుర్తించి, రానున్న రోజుల్లో వారికి తగిన గుర్తింపు ఇస్తామని, పదవులనూ కట్టబెడతామని భరోసా ఇచ్చారు.