- ఒకవేళ వచ్చినా మేమే గెలుస్తం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
- బీఆర్ఎస్ నాయకత్వంపై ఆ పార్టీ నేతలకు నమ్మకం లేదు
- ప్రతిపక్ష పాత్ర నిర్వహించే స్థితిలో కూడా ఆ పార్టీ లేదు
- పీసీసీ కొత్త కమిటీల్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తం
- రాష్ట్రంలో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తామని వెల్లడి
- ఏఐసీసీ చీఫ్మల్లికార్జున ఖర్గేతో ఢిల్లీలో భేటీ
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని తాను అనుకోవడం లేదని, ఒక వేళ వచ్చినా తామే గెలుస్తామని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. పార్టీ ఫిరాయింపుల అంశంలో హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే న్యాయపరమైన ప్రత్యామ్నాయాలు చూస్తామని చెప్పారు. పార్టీ మార్పులపై రాజ్యాంగబద్ధంగా నడచుకుంటామని తెలిపారు. తమ పార్టీ విధానాలు, పాలన చూసి కొందరు నేతలు వస్తే చేర్చుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నాయకత్వంపై నమ్మకం లేకనే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు. ప్రతిపక్ష పాత్ర నిర్వహించే స్థితిలో బీఆర్ఎస్ లేదని, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి సున్నా ఇచ్చారని అన్నారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను మహేశ్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసారు. తనకు పీసీసీ చీఫ్‌గా అవకాశం కల్పించినందుకు హైకమాండ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. దాదాపు గంట పాటు సాగిన ఈ సమావేశంలో ఖర్గే కీలక సూచనలు చేసినట్లు మహేశ్ కుమార్ గౌడ్ మీడియాకు తెలిపారు. కింది స్థాయి కార్యకర్త నుంచి సీనియర్ల వరకు సమన్వయం చేసుకుంటూ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారని చెప్పారు. ఆ దిశలో అట్టడుగున ఉన్న కార్యకర్త నుంచి అన్ని స్థాయిల్లో బలోపేతం చేస్తానని ఆయన తెలిపారు.
రాహుల్‌ను ప్రధానిని చేయడమే లక్ష్యం
పీసీసీ అధ్యక్షులు మారిన ప్రతిసారి కొత్త కమిటీలు ఏర్పడతాయని, తన కమిటీల్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తామని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఈ కొత్త కమిటీల విషయంలో ఏఐసీసీ పెద్దలతో చర్చించి, త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి, పార్టీ పెద్దల చేతిలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ దిశలో ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో ముందుకు సాగాల్సి ఉంటుందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చేలా పనిచేస్తానని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ముందడుగు వేస్తామన్నారు. బీఆర్ఎస్ నాయకత్వంపై నమ్మకం లేకి ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు.