కేటీఆర్​సన్నిహితులు మాతో టచ్​లో ఉన్నరు:టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

  • త్వరలో కాంగ్రెస్​లోకి మరిన్ని చేరికలు: మహేశ్ గౌడ్
  • ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసే పార్టీలోకి వస్తున్నరు
  • అదానీని వెంటనే అరెస్ట్​ చేయాలి..జేపీసీ వేసి నిజాలు నిగ్గుతేల్చాలి
  • అదానీ అరెస్టయితే మోదీ రాజీనామా చేయక తప్పదు
  • స్కిల్ వర్సిటీకి అదానీ100 కోట్లు ఇచ్చారు.. కేటీఆర్​ ఇచ్చినా తీస్కుంటమన్న పీసీసీ చీఫ్​

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ తో సన్నిహితంగా ఉండే ఇద్దరు, ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ లో త్వరలోనే మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు. శుక్రవారం గాంధీ భవన్ లో మహేశ్​ గౌడ్​ మీడియా సమావేశంలో మాట్లాడారు. 

ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారనేది త్వరలోనే అందరికీ తెలుస్తుందన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ తన అధికారాన్ని ఉపయోగించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బీఆర్ఎస్ సుప్రీం కోర్టుకు పోయినా.. ఇటు వైపే న్యాయం జరుగుతుందని అన్నారు. 

అమెరికాలో అదానీ అవినీతి, అక్రమాలపై కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ( జేపీసీ ) వేసి, నిజాలను నిగ్గుతేల్చాలని కోరారు.  అదానీపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడడం లేదని మహేశ్​ గౌడ్​ ప్రశ్నించారు. అదానీ అరెస్టయితే ప్రధాని మోదీ రాజీనామా చేయక తప్పదని, అందుకే అదానీ అంశంపై మోదీ నోరు మెదపడం లేదని విమర్శించారు. 

సెబీ, ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పుతున్నారని, 96 శాతం కేసులు ప్రతిపక్షాలపైనే నమోదవుతున్నాయని ఆరోపిం చారు. కేంద్ర ఏజెన్సీ సంస్థలు విఫలం కావడంతోనే అదానీ అవినీతిని బయపెట్టలేకపోయారని, ఇప్పుడు అమెరికా సంస్థ ఆయన అవినీతిని బయటపెట్టే వరకు మనకు తెలిసిరాలేదని అన్నారు.  

నేషనల్ హెరాల్డ్ అనే తమ సొంత పత్రికలో పెట్టుబడులు పెడితే తమ అధినేత రాహుల్ గాంధీని కేంద్ర దర్యాప్తు సంస్థలు మూడు రోజుల పాటు విచారణ పేరుతో పిలిచి వేధించాయని, మరి అదానీ అంత పెద్ద కుంభకోణానికి పాల్పడితే ఎలా వదిలేస్తారని ప్రశ్నించారు.  
 

కార్పొరేట్ శక్తులను బీజేపీ కాపాడుతున్నది..

మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ, అంబానీల ఆస్తులు వందల రెట్లు  పెరిగాయని మహేశ్​ గౌడ్​ ఆరోపించారు. అదానీ, అంబానీలకు మోదీ ఎందుకు వెసులుబాట్లు కల్పిస్తున్నారని ప్రశ్నించారు. స్టాక్ మార్కెట్ ను అదానీ తప్పుదారి పట్టించారని ఆరోపించారు. డబ్బు వ్యామోహం కన్నా రాజకీయ వ్యామోహంతో చేసే పనులు చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు. 

2014 నుంచి 2024 వరకు అదానీ ఆస్తులు ఎలా పెరిగాయో తేల్చాలని డిమాండ్ చేశారు. అదానీ ఆస్తులు ఇంతగా పెరగడం వెనుక మోదీ సర్కారు ఉన్నదని ఆరోపించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ధనికులు, పేదల మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోతున్నదని తెలిపారు. బీజేపీ పెత్తందార్ల పార్టీ అని, దేశంలోని కార్పొరేట్ శక్తులను కాపాడే పార్టీ అని  ధ్వజమెత్తారు. అర్హత లేకుండా అదానీ కంపెనీలు పెద్ద మొత్తంలో రుణాలు పొందాయని ఆరోపించారు. 

రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు చేయబోయే స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్లు ఇచ్చారని,  ఆయనేమీ సీఎం రేవంత్ రెడ్డి జేబులోకి ఇవ్వలేదని అన్నారు.  ఈ వర్సిటీకి కేటీఆర్ డబ్బులు ఇచ్చినా తీసుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అదానీ నుంచి వ్యక్తిగతంగా డబ్బులు తీసుకున్నారని, కానీ తాము అలా ఏమీ తీసుకోలేదని స్పష్టం చేశారు. 

 రాష్ట్రంలో అదానీకి తమ ప్రభుత్వం గుంట భూమి కూడా ఇయ్యలేదని తెలిపారు.  అదానీ న్యాయబద్ధంగా ఒప్పందాలు చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవని చెప్పారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్టు ప్రకారమే తమ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై ముందుకు వెళ్తుందని చెప్పారు. చట్టరీత్యా ఎవరు  వ్యాపారం చేసినా తమకు ఆమోదయోగ్యమేనని, దావోస్ లో చేసుకున్న ఒప్పందాల్లో ఏవైనా చట్ట విరుద్ధమైతే రద్దు చేసుకుంటామని తెలిపారు. 

అ దానీ విషయంలో తమ  అధినేత రాహుల్ గాంధీ నిర్ణయమే అందరికీ ఫైనల్ అని, ఇందులో ఇంకో నిర్ణయం అంటూ ఎవరికీ ఉండదని స్పష్టం చేశారు. పేద ప్రజల అభ్యున్నతి తమ విధానమని పేర్కొన్నారు. అదానీ విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని అన్నారు.