- కేసీఆర్, కేటీఆర్,కవిత మాత్రమే ఆ పార్టీలో ఉంటరు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- హరీశ్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నరని ఆరోపణ
సంగారెడ్డి, వెలుగు: వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అందుకే ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా పక్క చూపులు చూస్తూ వేరే దారి వెతుక్కుంటున్నారని, చివరకు కేసీఆర్, కేటీఆర్, కవిత మాత్రమే బీఆర్‌ఎస్‌లో మిగులుతారని చెప్పారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మల్కాపురం వద్ద పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి మహేశ్ గౌడ్ హాజరై, మాట్లాడారు.
రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీకి మనుగడ లేదన్నారు. మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. ‘‘గత పదేండ్లలో తెలంగాణను కేసీఆర్ ఆగం చేస్తే.. కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుంది. తొమ్మిదిన్నరేండ్లలో కేసీఆర్ రూ.8.50 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలపై భారం మోపితే.. ఆ అప్పుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి నెల రూ.10 వేల కోట్లు చెల్లిస్తున్నారు” అని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు బీటలు వారాయని, కాంగ్రెస్ పార్టీ 70 ఏండ్లలో చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు ఇప్పటివరకు చెక్కుచెదరలేదన్నారు.
జనవరిలో కొందరికి పదవులు..
జనవరిలో కొంతమంది కాంగ్రెస్ నేతలకు పార్టీ పదవులు లభిస్తాయని మహేశ్ గౌడ్ ప్రకటించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలంటే కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించామని, మరో 30 కార్పొరేషన్లకు త్వరలో చైర్మన్లను ప్రకటించనున్నామని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని అంటున్న బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలే తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. కార్యకర్తలే తమ బలమని, వారు ఉన్నంత కాలం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. పార్టీలో జగ్గారెడ్డికి ప్రత్యేక మార్క్ క్రియేట్ చేశారని, ప్రతి నాయకులు ఆయనలా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, టీఎస్ఐసీసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, ఎమ్మెల్యే సంజీవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, రామ్ చందర్ నాయక్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.