ఏడాదిలో 56 వేల ఉద్యోగాలు భర్తీ : పీసీసీ చీఫ్​ మహేశ్ ​గౌడ్​

ఏడాదిలో 56 వేల ఉద్యోగాలు భర్తీ : పీసీసీ చీఫ్​ మహేశ్ ​గౌడ్​
  • కాంగ్రెస్​ అంటేనే కమిట్​మెంట్ ​ఉన్న పార్టీ
  • డిపాజిట్  రాదన్న భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం
  • బీజేపీతో కేసీఆర్​కు లోపాయికారి ఒప్పందం
  • ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్​రెడ్డి నామినేషన్​.. ర్యాలీకి హాజరైన పీసీసీ చీఫ్​, మంత్రులు

కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉద్యోగాల పార్టీ అని, పట్టభద్రులకు ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని పీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్ గౌడ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వివిధ శాఖల్లో 56 వేల పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. మెదక్ – కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ  కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా కరీంనగర్​లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో మహేశ్​గౌడ్​ పాల్గొన్నారు.

ఈ ర్యాలీకి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ధనసరి సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.  పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్  అంటేనే కమిట్​మెంట్ ఉన్న పార్టీ. తెలంగాణ  ఇస్తామని చెప్పి ఇచ్చిన పార్టీ”అని తెలిపారు. బీజేపీతో  కేసీఆర్  లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, డిపాజిట్  రాదనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్  పోటీ  చేయడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రిగా ఉండి  బండి  సంజయ్ రాష్ట్రానికి రూపాయి కూడా తీసుకు రాలేదని,  కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వనందుకు ఇక్కడి బీజేపీ ఎంపీలు  సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కులగణన చారిత్రాత్మకమని, కాంగ్రెస్ చేసిన  కులగణన  వల్లే  56 శాతం బీసీలున్నట్లు  తేలిందన్నారు.

అంతకుముందు సిద్దిపేట జిల్లా గజ్వేల్​ మండలం రిమ్మనగూడలోని ఓ హోటల్​లో మీడియాతో మాట్లాడుతూ.. గజ్వేల్ ప్రజల ఓట్లతో గెలిచి, వారిని పట్టించుకోకుండా ఫాంహౌస్​లో సేద తీరుతున్న  కేసీఆర్​కు ప్రతిపక్ష నేత హోదా ఎందుకని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బీఆర్‌‌ఎస్‌- పార్టీ బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. 

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్లకు కాంగ్రెస్ ఎంతో మేలు చేసిందని తెలిపారు. నాలుగు జిల్లాల్లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి  చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ‘‘మతతత్వ బీజేపీని ఓడించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ” అని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..  తన విజయాన్ని కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్​గా అందిస్తానన్నారు.