తెలంగాణలో బీఆర్ఎస్​ పని ఖతం: మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణలో  బీఆర్ఎస్​ పని ఖతం: మహేశ్ కుమార్  గౌడ్
  • పీసీసీ చీఫ్  మహేశ్​కుమార్​ వ్యాఖ్య
  • ఏ పథకానికి ఏ పేరు పెట్టుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టం
  • బండి సంజయ్​ కామెంట్లకు రిప్లయ్

షాద్ నగర్, వెలుగు: బెదిరింపుల వల్ల ఫెడరల్  వ్యవస్థకు విఘాతం ఏర్పడుతుందని, ఏ పథకానికి ఏ పేరు పెట్టుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్  గౌడ్  స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్  నియోజకవర్గంలోని నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామంలో జరిగిన నాలుగు పథకాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎంపీ అనిల్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని సీఎం నిలబెట్టుకుంటున్నారని తెలిపారు.

 తెలంగాణ అభివృద్ధికి ఇచ్చిన హామీలకు కట్టుబడి కాంగ్రెస్  ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పదేండ్లుగా బీఆర్ఎస్  పాలనలో ప్రజలు ఇండ్లు, రేషన్​కార్డుల కోసం ఎదురుచూశారని తెలిపారు. బీఆర్ఎస్  అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, పార్లమెంట్​లో జీరో సీట్లకు పడిపోయిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్  పని అయిపోయిందని, రాజకీయంగా కోలుకోవడం కష్టమని పేర్కొన్నారు. ప్రజలు కాంగ్రెస్  ప్రభుత్వం వెంట ఉన్నారని, వచ్చే లోకల్​ బాడీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామని తెలిపారు. ఇందిరమ్మ పేరుతో పేదలకు ఇండ్లకు ఇస్తే బీజేపీకి కడుపు మంటగా ఉందని, కేంద్ర మంత్రి బండి సంజయ్  జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నులు కడుతోందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించాల్సిందేనన్నారు. బండి సంజయ్  వాస్తవాలు తెలుసుకొని విమర్శలు చేయాలని హితవు పలికారు.