
- బీఆర్ఎస్‌తో కలిసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నడు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- తెలంగాణ అభివృద్ధిపై మీకు బాధ్యత లేదా అని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి మోకాలడ్డుతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి, ఆ తర్వాత అభివృద్ధిపై దృష్టి పెట్టాలి.. కానీ రాష్ట్రంలో మాత్రం కిషన్ రెడ్డి సైంధవుడిలా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంపై నిత్యం విషం చిమ్మడమే ఆయన పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రిగా తెలంగాణ అభివృద్ధిని పట్టించుకునే బాధ్యత కిషన్ రెడ్డికి లేదా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు 8 మంది ఉంటే, తెలంగాణ అభివృద్ధి కోసం వారు ఏనాడైనా ప్రధాని మోదీని కలిశారా.. అని ప్రశ్నించారు. వారంత ప్రధాని మోదీని ఒప్పించి నిధులు తీసుకురావచ్చు కదా.. ఎందుకంత నిర్లక్ష్యం అని నిలదీశారు. కేంద్రం సహకరిస్తేనే అభివృద్ధిలో తెలంగాణ ముందుకువెళ్తదన్నారు. వరంగల్‌లోని మామునూను ఎయిర్‌పోర్టు విషయంలో బీజేపీ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం ఎయిర్‌పోర్టులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు.
బీసీలపై ఇక్కడి కేంద్ర మంత్రులకు, బీజేపీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉంటే దేశవ్యాప్తంగా కుల గణన సర్వే కోసం ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. బీసీ కుల గణన పేపర్లను బహిరంగంగా కాల్చినందుకే తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ సస్పెండ్ చేసిందని, ఈ విషయం తెలుసుకొని కిషన్ రెడ్డి మాట్లాడితే మంచిదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పింక్ బుక్ గురించి మాట్లాడుతున్నారని, ముందుగా ఆ పార్టీ నేతల స్కాంల గురించి అందులో రాయాలని సూచించారు. మహిళలకు స్వయం ఉపాధి పథకాలను ప్రభుత్వం కొనసాగిస్తున్నందుకు ఉత్తరాల ఉద్యమం చేపడుతున్నారా అని ప్రశ్నించారు.