రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యం : మహేశ్ ​కుమార్ ​గౌడ్​

రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యం : మహేశ్ ​కుమార్ ​గౌడ్​
  • రాజకీయాల్లో కాంప్రమైజ్ కంపల్సరీ
  • ఓపిక, నిబద్ధత, క్రమశిక్షణ గల కార్యకర్తలకే పదవులు 
  • పీసీసీ కార్యవర్గంలో యంగ్ బ్లడ్ ఉండాలనేది సీఎం ఆలోచన
  • యూత్ కాంగ్రెస్ ట్రైనింగ్ క్యాంపులో పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు

హైదరాబాద్, వెలుగు: రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. యూత్ కాంగ్రెస్ ప్రపంచంలో బిగ్గెస్ట్ అండ్ క్రేజియెస్ట్ అని, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం దొరకడం అదృష్టమన్నారు. పార్టీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎంత మంది ఉన్నా.. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గట్టుపల్లిలో తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ట్రైనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. 

ఈ సందర్భంగా మహేశ్​కుమార్ గౌడ్ హాజరై జాతీయ జెండాను ఎగరేసి మాట్లాడారు. రాజకీయాల్లో కాంప్రమైజ్ కంపల్సరీ అని, పరిస్థితులకు తగ్గట్టు సమయానుసారం నడుచుకోవాలని సూచించారు. ఏఐసీసీ మహామహులు ఎన్ఎస్ యూఐ నుంచి వచ్చినవారేనని, ఓపిక, నిబద్ధత, క్రమశిక్షణ గల కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలో పదవులు వరిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత యూత్ కాంగ్రెస్ నేతలపై ఉందన్నారు. 

పీసీసీ చీఫ్​గా సలహా ఇస్తున్నానని వెనక్కి తిరిగి చూడకుండా నిరంతరం కష్టపడాలని, అలా పనిచేసిన యూత్ కాంగ్రెస్ నేతలకు రానున్న ఎన్నికల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పీసీసీ కార్యవర్గంలో యంగ్ బ్లడ్ ఉండాలని తనతోపాటు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచంలా యూత్ కాంగ్రెస్ పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు స్వేచ్ఛ ఉంటుందని, రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం ప్రశ్నించేహక్కు ఉంటుందని తెలిపారు. 

యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సోషల్  మీడియాపై ఫోకస్ చేయాలని, ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ శివసేనారెడ్డి, తెలంగాణ యువజన కాంగ్రెస్ ఇన్​చార్జ్ సురభి, అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి పాల్గొన్నారు. కాగా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని మహేశ్​  గౌడ్ అన్నారు. తొక్కిసలాట ఘటనలో 18 మంది మృతిచెందడం మనసును కలిచివేసిందన్నారు.