- కులగణనకు బీజేపీ వ్యతిరేకం
- బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉండి కూడా చేయలేదని ఫైర్
- పీసీసీ కమిటీల్లో బీసీలకు 50 శాతం పదవులు ఇస్తామని ప్రకటన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కుల గణన చేపడుతుందని, బీసీల వాటా విషయంలో వెనక్కి తగ్గదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుందని చెప్పారు. ‘‘కులగణనపై ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ కమిషన్ చైర్మన్‌తో మాట్లాడాను. కులగణన గైడ్‌లైన్స్‌ను నాలుగు రోజుల్లో ప్రభుత్వం విడుదల చేయనుంది” అని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లోని బేగంపేట టూరిజం ప్లాజాలో “రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా సమగ్ర కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు” అనే అంశంపై బీసీ సంఘాల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
దీనికి మహేశ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కులగణన కాంగ్రెస్ పేటెంట్ అని, ఇందులో ఎవరికీ సందేహం అక్కర్లేదని ఆయన అన్నారు. ‘‘త్వరలో బీసీ సంఘాల నేతలను సీఎం దగ్గరికి తీసుకెళ్తాను. ఇందుకు టైమ్ కోరాను. కులగణనపై సలహాలు, సూచనలు ఇద్దాం. కులగణన పూర్తయ్యాక లక్ష మందితో నిజాం గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎంను, నన్ను సన్మానిం చాలి. ఇప్పుడు సన్మానాలు వద్దు” అని చెప్పారు.
బీసీలకు నాలుగు వీసీ పదవులు..
దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ప్రకటించిన తొలి వ్యక్తి రాహుల్ గాంధీ అని మహేశ్ గౌడ్ అన్నారు. ‘‘గత మూడేండ్లుగా రేవంత్, నేను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి అన్ని వర్గాల ప్రజలను కలిశాం. బీసీల మద్దతుతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ను ప్రవేశపెట్టే అదృష్టం నాకు లభించింది. బీసీల్లో ఐక్యత ఉంటేనే మన వాటా మనకు వస్తుంది” అని పేర్కొన్నారు. 2015లో కర్నాటకలో, 2023 బీహార్ లో కులగణన జరిగిందని.. త్వరలో మన రాష్ట్రంలో నూ జరుగుతుందని చెప్పారు. ‘‘పీసీసీ కమిటీల ఏర్పాటు నా ముందున్న పెద్ద సవాల్. వాటిల్లో బీసీల కు 50 శాతం పదవులు ఇస్తాం. యూనివర్సిటీల వీసీ పదవుల్లో 4 బీసీలకు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు.
కార్పొరేషన్ చైర్మన్, ఇతర పదవులు కూడా ఇస్తాం” అని ప్రకటించారు. పార్టీ కార్యకర్తలపై ఉన్న కేసులు తొలగిస్తే లీగల్ ఇబ్బందులు వస్తాయని, అసెంబ్లీ సమావేశాల్లో బిల్ పాస్ చేసి చర్చ జరపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘‘పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. కులగణన ఎందుకు చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్నారు. నాలుగైదు ఏండ్ల కింద రిజర్వేషన్లు తొలగిస్తామని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రకటనతో మాట మార్చారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం” అని మండిపడ్డారు.
పీసీసీ చీఫ్ మాటంటే జీవోనే: జాజుల
కులగణనపై పీసీసీ చీఫ్ ప్రకటన చేశారంటే, ప్రభుత్వం జీవో ఇచ్చినట్టేనని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ‘‘కులగణన చేపట్టాలని బుధవారం చలో హైదరాబాద్ కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. కానీ పీసీసీ చీఫ్ జోక్యం చేసుకుని.. కులగణన ప్రక్రియ నడుస్తున్నదని, ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని సూచించారు.
అదే విషయాన్ని బీసీ సంఘాలకు చెప్పాలని కోరితే ఆయన మీటింగ్ కు వచ్చారు” అని చెప్పారు. ‘‘దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రాహుల్ ప్రకటించడం అభినందనీయం. ఆయన ప్రధాని కావడం ఖాయం. కులగణన చేయకపోవడం వల్లే బీజేపీకి సీట్లు 400 నుంచి 240కి తగ్గాయి. ఇప్పుడు కులగణన చేస్తామని ఆర్ఎస్ఎస్ తో బీజేపీ చెప్పిస్తున్నది” అని అన్నారు.