బీఆర్ఎస్​ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడుంది: రేవంత్రెడ్డి

బీఆర్ఎస్​ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడుంది: రేవంత్రెడ్డి
  • కేసీఆర్, మోదీ, ఒవైసీ ముగ్గురూ ఒక్కటే
  • కల్వకుంట్ల ఫ్యామిలీ హైదరాబాద్ చుట్టూ పది వేల ఎకరాలు దోచుకుంది
  • చేవెళ్ల ‘ప్రజా గర్జన’ సభను సక్సెస్ చేద్దామని పిలుపు

పరిగి/ చేవెళ్ల, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో సామాజిక న్యాయం లేదని పీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో 50 శాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులు ఇచ్చి, అర శాతం ఉన్న కేసీఆర్ వర్గానికి నాలుగు మంత్రి పదవులు తీసుకున్నారని విమర్శించారు. 12 శాతం ఉన్న మాదిగలకు కేసీఆర్ ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అలాగే బీఆర్ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యేల లిస్టులో ఒక్క ముదిరాజ్ బిడ్డకు టికెట్ దక్కలేదన్నారు. 

గురువారం వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, వికారాబాద్, మన్నెగూడలో ‘చేవెళ్ల గర్జన సభ’ సన్నాహక సమావేశాల్లో రేవంత్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పదేండ్లలో రూ.22 లక్షల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ సర్కారు ఎవరిని అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. ‘ప్రతి కుటుంబానికి ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు, అర్హులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు.. వీటిల్లో ఏ ఒక్క హామీ కూడా నేరవేర్చలేదు’ అని అన్నారు. 

కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రం హైదరాబాద్ చుట్టూ పదివేల ఎకరాల భూమిని దోచుకుందని ఆరోపించారు. రూ. లక్ష కోట్లు, ఫామ్​హౌస్​లు కూడబెట్టుకుందన్నారు. మోదీ, కేసీఆర్, ఒవైసీ ఒక్కటే అని ఆరోపించారు.

గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటల్లోనే అభివృద్ధి

సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ అభివృద్ధి చెందినట్లుగా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రంగారెడ్డి–పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా వికారాబాద్, పరిగి, తాండూరు కు రావాల్సిన గోదావరి నీటిని కేసీఆర్ మెదక్ ప్రాంతానికి తీసుకెళ్లాడన్నారు. కృష్ణా జలాలను తెలంగాణ ప్రాంతానికి రానీయకుండా అడ్డుకున్న జగన్​ను ప్రగతిభవన్​కు పిలిచి.. పంచభక్ష్య పరమాన్నాలు పెట్టాడని విమర్శించారు.

కేసీఆర్​ మోసాన్ని జనం గుర్తించారు: మాణిక్ ఠాక్రే

రాబోయే ఎన్నికల్లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. కేసీఆర్ కుటుంబం అవినీతితో నిండిపోయిందని.. ఆయన కూతురు కవిత లిక్కర్ స్కామ్ లో ఉన్నారని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. 26న చేవెళ్లలో జరగబోయే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభ ను కేడర్, ప్రజలు సక్సెస్ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రజలను కేసీఆర్ అన్ని విధాలుగా మోసం చేశారన్నారు. ఇది గ్రహించిన జనం బీఆర్ఎస్ ను తరిమికొట్టడం ఖాయమన్నారు. 

మేడ్చల్ మాజీ ఎమ్యెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన కొందరు దొంగలు ఇతర పార్టీల్లోకి వెళ్లారని విమర్శించారు. అలాంటి దొంగలను ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఎవరైనా వేరే పార్టీలో చేరితే ఊరుకునేది లేదని.. ప్రజలంతా ఏకమై బుల్డోజర్లతో వాళ్ల ఇండ్లను కూల్చివేస్తామని హెచ్చరించారు.