
వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటలో పీసీసీ చీఫ్ రేవంత్‍రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రకు షాక్ తగిలింది. షెడ్యూల్డ్ ప్రకారం పాదయాత్ర బుధవారం నర్సంపేట నియోజకవర్గంలో ఉండగా ఏఐసీసీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అందుకు ఏర్పాట్లు చేయలేదు. తాను ముందస్తుగా నియోజకవర్గంలో యాత్ర చేపట్టానని దొంతి చెబుతున్నా.. రేవంత్‍రెడ్డి పర్యటనపై హైకమాండ్ తనకు సమాచారం ఇవ్వకపోవడంపై అలకబూనినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంగళవారం పీసీసీ శ్రేణులు ఫోన్ చేసినా ఆయన పెద్దగా స్పందించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్‍రెడ్డి తన పాదయాత్రను మహబూబాబాద్ జిల్లాకు షిఫ్ట్ చేశారు. స్వయంగా పీసీసీ చీఫ్ పర్యటనకు దొంతి సహకరించకపోవడంపై పార్టీలో చర్చ నడుస్తోంది.
ఇంట్లో ఉన్నా యాత్ర పేరుతో కలవలే
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసిన తనకు పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి యాత్ర సమాచారం ఇవ్వకపోవడంపై దొంతి మాధవరెడ్డి అలకబూనారు. పీసీసీ చీఫ్హాత్ సే హాత్ జోడో యాత్ర మొదట్లో భద్రాచలం నుంచి ఉంటుందన్నారు. కానీ మేడారం నుంచి మొదలుపెట్టారు. ములుగు తర్వాత నర్సంపేట నియోజకవర్గంలో ఉంటుందని పీసీసీ కమిటీ ప్రెస్‌మీట్‌లో ప్రకటించింది. దీనిపై నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి అయిన దొంతికి సమాచారమివ్వలేదు. మరోవైపు ఫిబ్రవరి 5 నుంచి తానే నియోజకవర్గంలో జోడోయాత్ర చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే ప్రకటించారు. మొదటిరోజు దుగ్గొండి మండలం గిర్నిబావిలో పాదయాత్ర చేసి అనంతరం సన్నాహక సమావేశం నిర్వహించారు. మరోవైపు రేవంత్‍రెడ్డి ములుగు జిల్లాలో యాత్ర చేసిన 6, 7 తేదీల్లో దొంతి తన యాత్రకు బ్రేక్ఇచ్చారు. అయినప్పటికీ జిల్లాలోనే ఉన్న రేవంత్‍రెడ్డిని కలవలేదు. తీరా రేవంత్‍రెడ్డి నర్సంపేటకు వచ్చేరోజు మళ్లీ స్టార్ట్ చేశారు. తద్వారా బుధవారం నియోజకవర్గ యాత్రలో బిజీ ఉన్నట్లు కవర్ చేశారు. ఇదిలా ఉండగా.. నర్సంపేట బీజేపీ అభ్యర్థిగా చెప్పుకునే రేవూరి ప్రకాశ్‍రెడ్డి సొంత గ్రామం దుగ్గొండి మండలం కేశవపూర్ నుంచి దొంతి యాత్ర చేపట్టడం ఆసక్తిరేపింది.
వరంగల్ డీసీసీ పదవి.. పంచాయితీ
వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపిక సైతం దొంతి అలకకు కారణంగా తెలుస్తోంది. జిల్లా పరిధిలో వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాలున్నాయి. దీంతో జిల్లా కాంగ్రెస్ పీఠాన్ని దక్కించుకునేందుకు సీనియర్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన మాధవరెడ్డి వర్గం ఇప్పుడు వరంగల్ అధ్యక్ష పదవి తమకే కావాలని భావిస్తోంది. కాగా, కొండా వర్గం కూడా ఈ పదవికి పోటీ పడుతున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో కొండా దంపతుల పట్ల సానుకూలంగా ఉండడంతో దొంతి వర్గం అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే డీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేయకుండానే రేవంత్ రెడ్డి జిల్లాలో పాదయాత్ర చేయడాన్ని తప్పుపట్టినట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం చూపించే దమ్ము ఉందా..?
హాత్ సే హాత్ జోడో యాత్రలో ఏఐసీసీ మెంబర్ దొంతి మాధవరెడ్డి
నర్సంపేట/ నల్లబెల్లి, వెలుగు: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలకు ఆ ప్రాజెక్టును చూపించే దమ్ము లేదని ఏఐసీసీ మెంబర్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్‌పై సీఎం కేసీఆర్‌వి ఊకదంపుడు మాటలేని ఫైర్అయ్యారు. ఎంప్లాయిస్‌కు 1వ తారీకున జీతాలు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. హాత్ సే హాత్ జూడో యాత్రలో భాగంగా 2వ రోజు దుగ్గొండి మండలం కేశవాపురంలో బుధవారం ఆయన ప్రారంభించారు. యాత్ర కేశవపురం, లక్ష్మీపురం, బంధంపల్లి, పొనకల్లు గ్రామాల మీదుగా కొనసాగింది. యాత్రలో కాంగ్రెస్ నియోజకవర్గ లీడర్లు పాలాయి శ్రీనివాస్, రవీందర్రావు, శ్రీనివాస్‌రెడ్డి, బాబు, లక్ష్మణ్, తిరుపతిరెడ్డి, సాంబయ్య, రతన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.