తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలిస్తాం : రేవంత్ రెడ్డి

తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరగాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ వనరులను కేసీఆర్ ఫ్యామిలీ విధ్వంసం చేసిందన్నారు. ఏఐసీసీ ఆదేశాలతో తాము మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశామన్నారు. వారు కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని వివరించారు. పొంగులేటితో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి దాదాపు రెండు గంటల పాటు భేటీ అయ్యి.. పలు విషయాలపై చర్చించారు. రేవంత్, కోమటిరెడ్డి వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లు రవి, చిన్నారెడ్డి, బలరాం నాయక్ ఉన్నారు. 

తెలంగాణ పేరునే లేకుండా కేసీఆర్ కుట్ర చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సాధనలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. తొమ్మిదేళ్లల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ నీరుగార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. అతి త్వరలోనే ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యి.. తెలంగాణ రాష్ర్టంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పెద్దల ఆశీస్సులతోనే తాము ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వివరించారు. తాము చేస్తున్న పోరాటంలో తెలంగాణ ప్రజలందరూ విజయం సాధిస్తారన్నారు. కేసీఆర్ కుటుంబంలోని నలుగురు వ్యక్తులకు.. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న పోరాటం ఇదే అన్నారు. 

ALSO READ: అమరుల స్మారక స్థూపం.. ఏ అంతస్థులో ఏముంది

విద్యార్థులు ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారని.. తారాజువ్వలుగా పోరాటం చేశారని రేవంత్ రెడ్డి చెప్పారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చి తెలంగాణ వనరులను కేసీఆర్ చెరపట్టారని ఆరోపించారు. తెలంగాణ జాతిని పట్టి పీడిస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణకు పట్టిన పీడను చీల్చడానికి ఏఐసీసీ ఆదేశాల మేరకు తామంతా కలిసి పని చేస్తున్నామని వివరించారు. కేసీఆర్ ను ఏ రకంగా గద్దె దించాలో తామంతా చర్చించుకున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్నారు. పొంగులేటి రాకతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు. ప్రజాసంఘాల నేతలపై ఉపా చట్టాలను పెట్టి.. తీవ్రంగా వేధిస్తున్నారంటూ మండిపడ్డారు.