- ఫ్రీ కరెంట్’ ఎత్తేసే కుట్ర: కేటీఆర్, ఇతర మంత్రులు...
- నేడు ఊరూరా కాంగ్రెస్ దిష్టిబొమ్మల దహనం
- రేవంత్ మాటలను వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ ఫైర్
- కరెంట్ కోతలకు నిరసనగా నేడు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు
హైదరాబాద్, వెలుగు: అమెరికాలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పుట్టించాయి. అవసరమైతే సీతక్కే సీఎం అవుతారంటూ ఆయన చేసిన కామెంట్లు సొంత పార్టీ కాంగ్రెస్‌లో దుమారం రేపుతుండగా.. ఉచిత విద్యుత్‌పై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. బుధవారం ఊరూరా కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం పలు చోట్ల రేవంత్ దిష్టిబొమ్మలను ఆ పార్టీ నేతలు దహనం చేశారు. మంత్రులు ప్రెస్మీట్లు పెట్టి.. వ్యవసాయానికి 3 గంటల ఉచిత విద్యుత్ చాలని రేవంత్ ఎట్ల అంటారని, 24 గంటల ఫ్రీ కరెంట్‌ను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. దీనికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ అనని వ్యాఖ్యలను అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బుధవారం అన్ని నియోజకవర్గాల్లోని సబ్స్టేషన్ల వద్ద ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సీఎం కేసీఆర్, ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి శ్రేణులు కదలిరావాలని కోరింది. అమెరికాలో ఉన్న రేవంత్ కూడా ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌తో బీఆర్ఎస్ పార్టీకి వెన్నులో వణుకు పుట్టిందని, అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు.
అమెరికాలో రేవంత్ ఏమన్నరంటే..
అమెరికాలో జరిగిన ఎన్నారై కాంగ్రెస్ మీటింగ్ లో ఎమ్మెల్యే సీతక్కతోపాటు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను అక్కడివాళ్లు పలు ప్రశ్నలు వేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.
హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తా: వెంకట్‌రెడ్డి
తమ పార్టీ అధికారంలోకి వస్తే సీతక్కే సీఎం అవుతారేమోనని రేవంత్ చేసిన కామెంట్లను కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. ‘‘గిరిజనులకే సీఎం పదవి ఇవ్వాలనుకుంటే పొదెం వీరయ్యకేం తక్కువ. ఆయన కూడా మూడోసారి ఎమ్మెల్యే అయ్యిండు. 30 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నడు. దళితులకు ఇస్తే దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్క వంటి వాళ్లూ ఉన్నరు. బీసీల్లోనూ నేతలున్నరు” అని అన్నారు. సీతక్క సీఎం అవుతారని అనడం పెద్ద జోక్ అని వ్యాఖ్యానించారు. ఉచిత కరెంట్ కామెంట్లను కూడా ఆయన తప్పుబట్టారు.