అబద్ధాలు చెప్పుట్ల అయ్యా కొడుకులకు అవార్డు ఇయ్యాలె : రేవంత్

  • బీఆర్ఎస్ మళ్లా గెలిస్తే ఆడోళ్ల మెడలోని పుస్తెలు కూడా దోచుకుంటరు: రేవంత్
  • ఇంకో లక్ష కోట్లు దోచుకునేందుకే కేసీఆర్ మూడోసారి చాన్స్ ఇవ్వుమంటున్నడు
  • పేదలు గొర్లు, బర్లు కాసుకోవాలె.. నీ కొడుకు, బిడ్డ మాత్రం రాజ్యమేలాల్నా?
  • హైదరాబాద్ చుట్టుపక్కల 10 వేల ఎకరాలు కబ్జా చేసిన్రు
  • కమీషన్ల కక్కుర్తితో ఆంధ్రా కాంట్రాక్టర్లకుపనులివ్వడం వల్లే మేడిగడ్డ కుంగింది
  • కాళేశ్వరంపై మోదీ ఎందుకు మాట్లాడ్తలే..కేసీఆర్​కు భయపడుతున్నడా? 

ఆదిలాబాద్, వెలుగు :  కేసీఆర్, కేటీఆర్..​ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే చెబుతారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘అబద్ధాలు చెప్పుట్ల అయ్యా కొడుకులు పోటీ పడ్తున్నరు. వీరిద్దరిలో అబద్ధాల అవార్డు ఎవరికి ఇయ్యాలో అర్థమైతలేదు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తరట.. రైతు బంధు బంద్​ పెడ్తరట’ అని అబద్ధాలు చెప్తున్నరు. మేం రైతు బంధు రూ.15 వేలకు పెంచుతమని, ధరణి కంటే మంచి పోర్టల్​ తెస్తమని చెప్తున్నం” అని అన్నారు. బుధవారం ఉట్నూర్, ఆదిలాబాద్ పట్టణాల్లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభల్లో రేవంత్​ పాల్గొని మాట్లాడారు.

‘‘పేదలకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేని దుస్థితిలో కేసీఆర్​ఉన్నడు. నిరుద్యోగ భృతి లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లేవు. ఉద్యోగాలు లేవు. మైనార్టీ, గిరిజనులకు రిజర్వేషన్లు లేవు.  కానీ అన్నీ ఇచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నరు. అసలు ఏమీ ఇవ్వని కేసీఆర్​కు ఓటు ఎందుకు వెయ్యాలి” అని రేవంత్​ ప్రశ్నించారు. ఇంకో లక్ష కోట్లు దోచుకునేందుకు, పేదల భూములు గుంజుకునేందుకు, చివరగా మనుమడికి మంత్రి పదవి ఇప్పించుకునేందుకే.. మూడోసారి చాన్స్ ఇవ్వుమని కేసీఆర్ అడుగుతున్నడనుకుంట అని విమర్శించారు. బీఆర్ఎస్ ​మళ్లీ గెలిస్తే ఆడోళ్ల మెడలోని పుస్తెలు కూడా దోచుకుంటారని కామెంట్ చేశారు. 

అసైన్డ్ ​భూములపై పూర్తి హక్కులు కల్పిస్తం..

‘‘పేదోళ్లు గొర్లు, బర్లు, మేకలు కాసుకోవాలే. చెప్పులు కుట్టుకోవాలే. బట్టలు ఉతకాలే. తన కొడుకు, బిడ్డ మాత్రం రాజ్యమేలుతూ దోచుకోవాలే అన్నట్టుగా కేసీఆర్ తీరు ఉంది. అందుకే దొరల తెలంగాణ కావాలో? ప్రజా తెలంగాణ కావాలో? ప్రజలే తేల్చుకోవాలి” అని రేవంత్ అన్నారు. కమీషన్ల కోసం ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వడం వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని ఆరోపించారు. ‘‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మడిహెట్టి వద్ద రూ.38 వేల కోట్లతో ప్రాణహిత ప్రాజెక్టు కడ్తే 40 లక్షల ఎకరాలకు సాగు నీరందేది.

కానీ మహారాష్ట్ర రైతులు 3 వేల ఎకరాలు ఇవ్వడం లేదనే సాకుతో కేసీఆర్ రూ.1.50 లక్షల కోట్లతో కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు దిగమింగిండు. ఆదిలాబాద్ ప్రజలకు చుక్క నీళ్లు ఇవ్వకుండా అన్యాయం చేసిండు’’ అని అన్నారు. వైఎస్సార్ హయాంలో రుణమాఫీ, సబ్సిడీ కింద ఎరువులు, విత్తనాలు ఇచ్చామని.. కానీ కేసీఆర్ వచ్చాక సబ్సిడీలన్నీ ఎత్తేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుటుంబం హైదరాబాద్​చుట్టుపక్కల 10 వేల ఎకరాలు ఆక్రమించుకుందని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక పేదల భూములన్నింటినీ కంప్యూటరీకరిస్తామని, అసైన్డ్ ​భూములపై పూర్తి హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 

దమ్ముంటే గుజరాత్​లో బీసీని సీఎం చేయండి.. 

ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి వెళ్తున్నారే తప్ప, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఎందుకు మాట్లాడడం లేదని రేవంత్ ప్రశ్నించారు. కుంగిన మేడిగడ్డను ఎందుకు పరిశీలించడం లేదని అడిగారు. ‘‘ఎక్కడో ఢిల్లీలో లిక్కర్ కేసు గురించి తీగ లాగుతున్న మోదీ.. ఇక్కడ కూలిన మేడిగడ్డ మీద ఎంక్వైరీ ఎందుకు చేయడం లేదు. కేసీఆర్ దగ్గర లంచాలు మెక్కిండా.. ఇంకేదైనా కారణమా? అసలు కేసీఆర్​కు మోదీ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలి” అని డిమాండ్ చేశారు. ‘‘బీసీని సీఎం చేస్తామని బీజేపీ చెబుతోంది. కానీ ఇక్కడ ఆ పార్టీ గెలిచే పరిస్థితే లేదు. బీసీలను మోసం చేసేందుకే అలా మాట్లాడుతోంది. మోదీకి దమ్ముంటే ముందు గుజరాత్ లో బీసీని సీఎం చేసి ఇక్కడికి రావాలి” అని సవాల్ విసిరారు. 

ఇంద్రవెల్లి బాధితులను ఆదుకుంటం.. 

దళితులు, గిరిజనులపై కాంగ్రెస్​కు ఉన్న ప్రేమ.. దేశంలో మరే పార్టీకి లేదని రేవంత్ అన్నారు. ‘‘గిరిజనులకు, దళితులకు భూములు ఇచ్చిందే ఇందిరా గాంధీ. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఆయా వర్గాలకు పట్టాలు వచ్చినయ్. గిరిజనుల కోసం ఐటీడీఏ లాంటివి ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు ఐటీడీఏలు మూలనపడ్డాయి. ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరుల భూములకు గతంలో కాంగ్రెస్ పహాణీలు, రుణాలు ఇచ్చింది. ఇప్పుడు పహానీలు లేవు.

 రుణాలు లేవు. లంబాడాలు, ఆదివాసీల మధ్య ప్రభుత్వం కూర్చొని చర్చలు జరిపితే ఈ పంచాది ఉండేది కాదు. ఈ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. లంబాడా, ఆదివాసీలు మాకు రెండు కండ్లు. ఇంద్రవెల్లి కాల్పుల బాధిత కుటుంబాలను గుర్తించి న్యాయం చేస్తాం” అని హామీ ఇచ్చారు. ఖానాపూర్​లో ఎన్నో గ్రామాలకు ఇంకా కరెంట్ లేదని, దీనికి ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. ‘‘ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు.. హనుమాన్ గుడి లేని తండా ఉండదు. మరి బీఆర్ఎస్ ​ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్​లు ఎక్కడున్నాయో చూపించాలి’’ అని సవాల్ విసిరారు.   

జోగు రామన్న సక్కగా లేకనే మంత్రి పదవి పోయింది

‘‘పదిహేనేండ్లు ఎమ్మెల్యేగా పని చేసిన జోగు రామన్న సక్కగా ఉంటే మంత్రి పదవి ఎందుకు పోతుంది. రామన్న నీతిమంతుడైతే, పదవి నుంచి ఎందుకు తొలగించారు. అంటే  కేసీఆర్ దృష్టిలో ఏదో తప్పు చేశారనే కదా! అందుకే ప్రజలు ఈసారి రామన్నను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డిని గెలిపించేందుకు సిద్ధమయ్యారు” అని రేవంత్ అన్నారు. ‘‘తెలంగాణలో ఆదిలాబాద్ గడ్డకు న్యాయం జరగలేదు. ఆదిలాబాద్ కు యూనివర్సిటీ ఇవ్వలేదు. ఈ ప్రాంతానికి గిరిజన వర్సిటీ ఇస్తే కుట్ర చేసి రాకుండా చేశారు” అని అన్నారు. ఆదిలాబాద్​లో నలుగురు టికెట్​ ఆశించగా,  సర్వే ప్రకారం టికెట్ ఇచ్చామని తెలిపారు. 

ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటం.. 

అధికారంలోకి రాగానే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామని, ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ‘‘వెనుకబడిన ఆదిలాబాద్​ను ఆదుకోవాలని తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కానీ కేసీఆర్ తన స్వార్థం కోసం ప్రాజెక్టును మేడిగడ్డకు తరలించారు. కడెం ప్రాజెక్టును సరిగా మెయింటెనెన్స్​ చేయకపోవడంతో  రెండుసార్లు తెగే స్థాయికి వచ్చింది. అలాంటి బీఆర్ఎస్ సర్కార్ ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు ఎలా కడుతుంది” అని ప్రశ్నించారు. ‘‘ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ అమెరికా నుంచి వచ్చారు. ఓడిపోతే మళ్లీ అమెరికాకే వెళ్లిపోతారు. కాంగ్రెస్​లో వెడ్మ బొజ్జు లాంటి పేదకు నేను కొట్లాడి టికెట్​ ఇప్పించాను. వెడ్మ బొజ్జు లాంటి వ్యక్తులు గెలిస్తేనే ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెరుగుతుంది” అని అన్నారు. 

రేవంత్​కు బర్త్ డే విషెస్ వెల్లువ

హైదరాబాద్, వెలుగు :  రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ చెప్పడానికి అభిమానులు, కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు పోటీపడ్డారు. బుధవారం ఉదయం నుంచే రేవంత్ ఇంటికి వందల మంది కార్యకర్తలు వెళ్లారు. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా పలు నియోజకవర్గాలకు చెందిన ఇతర పార్టీల కార్యకర్తలు రేవంత్​ సమక్షంలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు.