స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్ర సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య లాంటి వాళ్లు ఎమ్మె్ల్యేలు అయ్యాక ఆడబిడ్డలు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితులను బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి పెట్టిందన్నారు. ప్రజల కష్టాలు, కన్నీళ్లలో తోడు ఉండాలని, ఈ ప్రాంత ఆడబిడ్డగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, ప్రజల గళమై అసెంబ్లీలో వినిపించాలని కాంగ్రెస్ నుంచి ఇందిరా పోటీ చేస్తున్నారని, ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు రేవంత్.
స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య లాంటి వాళ్లు ఆడవాళ్ల విషయంలో మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడాలని, వారి గౌరవాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఒకవేళ గౌరవం నిలబెట్టుకోలేకపోలే ప్రజలు కర్రకాల్చి వాత పెడుతారని హెచ్చరించారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కడియం, రాజయ్య చేసిందేమీ లేదన్నారు. శ్రీహరి సంగతి రాజయ్య చెప్పాడు.. రాజయ్య సంగతి శ్రీహరి ఇప్పటికే చెప్పాడు.. ఎవరు ఎలాంటి వాళ్లు మనం చెప్పాల్సిన పని లేదు అని అన్నారు. ఆయన రాజయ్యనా..? లేక కృష్ణయ్యనా... ఆ విషయం తనకు తెలియదన్నారు.
ఇద్దరు (కడియం, రాజయ్య) డిప్యూటీ సీఎంలుగా పని చేసి, ఉద్యోగాలు పొగొట్టుకున్నారని సెటైర్ వేశారు. వీళ్లద్దరి గుణగణాలు తెలిసే ఇద్దరి ఉద్యోగాలు కేసీఆర్ ఉడగొట్టాడని చెప్పారు. ఇలాంటి వాళ్లు స్టేషన్ ఘన్ పూర్ నుంచి ఎమ్మెల్యేలుగా అయితే...గౌరవం ఉంటుందా..? అని ప్రశ్నించారు. గతంలో కడియం శ్రీహరి విద్యాశాఖ మంత్రిగా పని చేసినా నియోజకవర్గానికి ఒక్క డిగ్రీ కాలేజీ కూడా తీసుకురాలేదన్నారు. రాజయ్య వైద్యారోగ్యశాఖ మంత్రిగా పని చేసినా 100 పడకల ఆస్పత్రి తీసుకురాలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరాంలోనే నియోజకవర్గానికి 100 పడకల ఆస్పత్రి, డిగ్రీ కాలేజీ తీసుకొచ్చే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో మహిళలకు అవకాశం ఇవ్వలేదని, మంత్రివర్గంలో మాదిగలకు స్థానం కల్పించలేదని మండిపడ్డారు. ఆడబిడ్డలపై కేసీఆర్ కు ఉన్న గౌరవం ఏందని ప్రశ్నించారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో నలుగురు ఆడబిడ్డలు మంత్రులుగా ఉంటారని, వారికి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ బడికి పోవాల్సిన పిల్లాడు.. బీరు సీసాను ఒక చేతిలో.. మరో చేతిలో బీఆర్ఎస్ జెండాను పట్టే పరిస్థితులను రాష్ట్రంలో కేసీఆర్ తీసుకొచ్చారని ఆరోపించారు. ఏతల్లి అయినా తమ కన్నకొడుకు తాగుబోతు అయితే.. సహించదని చెప్పారు. నిరుద్యోగంలో దేశంలోనే రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని అన్నారు.
కేసీఆర్ లాంటి దోపిడీదారుడు దేశంలో ఎవరూ లేరన్నారు. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ బీరు సీసాలు అమ్మకోండి అని మంత్రి దయాకర్ రావు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఎవరైనా మతి ఉండే ఇలా మాట్లాడే మాటలేనా..? అని ప్రశ్నించారు. నిజంగానే బీఆర్ఎస్ ను నమ్మితే.. ఖాళీ బీరు సీసాలు మోపిస్తాడన్నారు. ప్రజలు ఆశించిన తెలంగాణ ఇప్పుడు లేదన్నారు. దోపిడీ దొంగల ప్రభుత్వం ఉందన్నారు. దండుపాళ్యం ముఠా ప్రభుత్వాన్ని పొలిమేర్లు దాటే వరకూ తరమాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే.. 30 లక్షల మంది నిరుద్యోగుుల అడవిబాట పట్టే పరిస్థితి వస్తుందన్నారు. ఒకవేళ అదే పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వంలో ఒక్కడు కూడా ఉండరని చెప్పారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ శిరేచ్ఛేదం జరగాల్సిందే అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చాల్సిందే.. ఇందిరామ్మ రాజ్యం రావాల్సిందే అని చెప్పారు. కౌలురైతులకు కూడా రైతు బంధు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉచిత కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందన్నారు.