కేసీఆర్ సింగరేణిని నాశనం చేసిండు :రేవంత్రెడ్డి

  • సంస్థను ప్రైవేట్‌పరం చేసేందుకు కేసీఆర్‌‌ కుట్ర: రేవంత్‌ రెడ్డి
  • తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులదే ప్రధాన పాత్ర 

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: సింగరేణిలో ఒకే ఒక్క ఆఫీసర్‌‌ని పెట్టి సంస్థను నాశనం చేసిండని సీఎం కేసీఆర్‌‌పై పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఫైర్‌‌ అయ్యారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయడానికి పన్నాగం పన్నిండని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం భూపాలపల్లిలోని కేటీకే1 ఇంక్లైన్‌లో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన సింగరేణి కార్మికుల త్యాగాన్ని బీఆర్‌‌ఎస్‌ సర్కార్‌‌ మర్చిపోయిందన్నారు.

సకల జనుల సమ్మెలో సంస్థ కార్మికులు భాగస్వాములు కాకపోతే తెలంగాణ సాకరమయ్యేదా? అని ప్రశ్నించారు. కార్మికుల వైపు ఉన్నామని చెబుతున్న అధికార పార్టీ.. వారి సమస్యలను పరిష్కరించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నదని నిలదీశారు. జెండాలను పక్కనబెట్టి అంతా ఏకమైతేనే తెలంగాణ సాకారమైందన్నారు. సింగరేణిని ప్రైవేట్‌పరం చేసేందుకు బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం అరబిందోకు మైన్ అప్పగించింది నిజం కాదా? తాడిచర్ల మైన్‌ను సీఎం తన దగ్గరి వాళ్లకు అప్పగించింది నిజం కాదా? నైని కోల్ మైన్‌ను ఆదానీకి కట్టబెట్టాలని చూసింది నిజం కాదా? అని రేవంత్ ప్రశ్నించారు. 

సింగరేణిని ప్రైవేట్‌పరం చేయాలని చూస్తే అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కార్మికుల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి ఎన్నికలను జరపకుండా కేసీఆర్ ఎందుకు తప్పించుకుంటున్నారని ప్రశ్నించారు. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్‌‌ 3న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. తెలంగాణను గుల్ల చేసిన ఈ పందికొక్కుల పని పట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.