న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కేసిఆర్ దోపిడికి బీజేపీ సహకరిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. లక్షల కోట్లు దోచుకుంటున్న సీఎం కుటుంబాన్ని జైలుకు పంపుతామని బీజేపీ నాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నారే తప్ప కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు, సింగరేణి కోల్ మైన్స్ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందన్న రేవంత్.. ఈ విషయాల్లో టీఆర్ఎస్, బీజేపీలు కలిసి డ్రామాలాడుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఇంత భారీ మొత్తంలో అవినీతి జరుగుతుంటే కేంద్రం ఎందుకు చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని.. సీఎం అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. కేంద్రంపై నమ్మకం లేనందునే కోర్టు తలుపులు తట్టామని.. టీఆర్ఎస్, బీజేపీలు ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
సింగరేణి టెండర్ల విషయంలో 50వేల కోట్లకుపైగా అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓ సంస్థకు లాభం చేకూర్చేందుకు టెండర్ నింబంధనల్లో మార్పులు చేశారని, దీనిపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు జాతీయ దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సింగరేణి సీఎండీగా కొనసాగే అర్హత శ్రీధర్కు లేదన్న రేవంత్.. పదవీకాలం పూర్తైన ఐఏఎస్ ను ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. సింగరేణిలో జరుగుతున్న ఉల్లంఘనల విషయంలో ప్రధాని జోక్యం చేసుకుని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్తో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు.