హైదరాబాద్, వెలుగు: రైతులను మోసం చేయడంలో సీఎం కేసీఆర్‌ది ఆల్‌టైమ్ రికార్డ్ అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. రైతులతో రాజకీయం చేసేందుకు బీఆర్ఎస్ బయల్దేరిందని.. ఇన్నాళ్లూ అలంకారప్రాయంగా ఉంచిన రైతు వేదికలను రాజకీయ వేదికలుగా మార్చేందుకు బరితెగించిందని మండిపడ్డారు.
ఆ ద్రోహులకు బుద్ధి చెప్పేందుకు ఇదొక మంచి అవకాశమని, సమస్యలపై బీఆర్ఎస్ నాయకులను నిలదీయాలని రైతులకు రేవంత్ పిలుపునిచ్చారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తరో? వడ్ల పైసలు, పోడు పట్టాలు ఎప్పుడిస్తరో ప్రశ్నించాలని సూచించారు. ‘‘సమస్యలను పరిష్కరించడమా.. బీఆర్ఎస్ను బొంద పెట్టడమా తేల్చేద్దాం. రైతు ద్రోహి ప్రభుత్వాన్ని నిలువునా పాతరేద్దాం” అని పిలుపునిచ్చారు. ఈ మేరకు రైతులకు రేవంత్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ‘‘రుణమాఫీ కోసం రైతులు ఇన్నాళ్లూ ఎదురుచూసినా చేయలేదు. చివరి బడ్జెట్కూడా అయిపోయింది. రుణమాఫీ చేయరన్న విషయం తేలిపోయింది. రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య 31 లక్షలు. రూ.20 వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసింది” అని అందులో పేర్కొన్నారు. కేసీఆర్ మాటలకు మోసపోయి అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన రైతులు.. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ALSO READ :అలస్కాలో భారీ భూకంపం
వడ్ల బకాయిలు రూ.6,800 కోట్లు
వడ్లు కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయన్న కేసీఆర్ మాటలు కాగితాలకే పరిమితమయ్యాయని రేవంత్ మండిపడ్డారు. జూన్ 15 నాటికి రూ.6,800 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. ‘‘ఈ తొమ్మిదేండ్లలో పేదల నుంచి ప్రభుత్వం లక్షల ఎకరాల అసైన్డ్ భూములను గుంజుకున్నది. పేద గిరిజన, దళితులకు భూములు ఇచ్చేందుకు చేతులు రాలేదు. ఎన్నికలు వస్తుండడంతో ఇప్పుడు పోడు పట్టాలపై సర్కార్ హడావుడి చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 11.50 లక్షల మంది ఆదివాసీలు అర్హులని తేలినా, కేవలం 4 లక్షల మందికి పట్టాలు ఇచ్చినట్టు చేసి చేతులు దులుపుకుంది. రైతులకు ఫ్రీగా ఎరువులిస్తామని చెప్పి మోసం చేసింది. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామంటున్న కేసీఆర్.. కనీసం 10 గంటలు కూడా ఇవ్వడం లేదు. సబ్స్టేషన్లలోని లాగ్బుక్కులే ఇందుకు సాక్ష్యం. మా పార్టీ ఈ ఆధారాలను బయటపెట్టడంతో సర్కార్ ఉలిక్కిపడింది. అందుకే సబ్స్టేషన్లలోని లాగ్బుక్కులన్నింటినీ వెనక్కి తెప్పించుకుంది’’ అని లేఖలో రేవంత్ పేర్కొన్నారు.