హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ అస్తిత్వాన్నే చంపేశారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అనే పదం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగమని, దాన్ని చంపేయాలనుకుంటున్న హంతకుడు కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ తన పార్టీ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంగా బుధవారం రేవంత్ స్పందించారు. కేసీఆర్ 2001 నుంచి 2022 వరకు తెలంగాణ పేరుతో ఆర్థికంగా బలోపేతమయ్యారన్నారు. ఇప్పుడు తెలంగాణ అనే పదం రాష్ట్రంలో వినిపించకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలతో కేసీఆర్ కు రుణం తీరిపోయింది. ఇక్కడ తన ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు కాలం చెల్లిందని ఆయన గ్రహించారని అందుకే కొత్త రాగం ఎత్తుకున్నారన్నారు. ప్రజల్ని మభ్య పెట్టడానికీ, కుటుంబ తగాదాల పరిష్కారం, రాజకీయ దురాశ కోసమే కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టారని అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్న కేసీఆర్ తర్వాత ప్రపంచ రాష్ట్ర సమితి అని కూడా పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.
తమ పార్టీ నుంచి తెలంగాణ పేరును తొలగించిన కేసీఆర్‌కు ఈ ప్రాంతంలో పోటీ చేయడానికి అర్హత లేదన్నారు. తెలంగాణ ప్రజలు ఈ విషయం సీరియస్‌గా ఆలోచించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నాననీ, తెలంగాణ అనే పదం వినిపించకుండా కుట్ర చేస్తున్న తెలంగాణ హంతకుడిని వదిలే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ లాంటి దుష్ట శక్తి నుంచి తెలంగాణకువిముక్తి కలిగించాలని దసరా సందర్భంగా ప్రజలు కోరుకోవాలని అన్నారు. రూట్‌మ్యాప్ పరిశీలించిన రేవంత్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం నారాయణపేట జిల్లా కృష్ణ మండల సరిహద్దు వద్దకు వెళ్లి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రూట్‌మ్యాప్‌ను పరిశీలించారు.